జగన్ తగ్గేదేలే..! నర్సీపట్నం టూర్ పై వైసీపీ కీలక ప్రకటన..!
ఏపీలో ఎల్లుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపడుతున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన కలకలం రేపుతోంది. ఈ పర్యటనకు అనుమతులు కోరుతూ వైసీపీ ఇప్పటికే పోలీసులకు వినతిపత్రం ఇవ్వడం, దాన్ని వారు తోసిపుచ్చుతూ కేవలం హెలికాఫ్టర్ పర్యటనకు మాత్రమే రావాలని కోరడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం టూర్ పై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది.
పోలీసు ఆంక్షలతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 9న మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని సందర్శించడంలో ఎలాంటి మార్పూ ఉండదని వైయస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. జగన్ విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నానికి వస్తుంటే భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేయడం రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయనడానికి నిదర్శనమని పార్టీ నేతలు కన్నబాబు, మజ్జి శ్రీనివాససరావు ఆరోపించారు.

జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి పర్యటనకి భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వారం రోజులుగా ఉత్తరాంధ్రలో తీవ్రమైన వర్షపాత పరిస్థితులున్నా ఆయన్ను హెలిక్యాప్టర్ లోనే రావాలనడం చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. విజయవాడ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుని అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నంలోని మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శిస్తారని కన్నబాబు తెలిపారు. భద్రత కల్పించలేమన్న కారణంతో ఉద్దేశపూర్వకంగా వైయస్ జగన్ పర్యటనని కట్టడి చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కి ఉద్యమాలు కొత్తకాదని, ఎవరు ఎన్ని విధాలుగా కట్టడి చేసే కుట్రలు చేసినా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారన్నారు. అందులో రెండో ఆలోచన లేదన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకుడికి ప్రజల్లో తిరగడం కొత్తకాదని, తమ నాయకుడి అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చామని, అందుకు అనుగుణంగా పోలీసులు రోప్ పార్టీలను సిద్ధం చేసుకోవాలే కానీ, భద్రతా కారణాలను చూపించి చేతులెత్తేయడం ప్రభుత్వానికి అవమానకరమన్నారు.

గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో రోడ్డు మార్గంలో చాలాసార్లు పర్యటించారని, ఆ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైసీపీ ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించిందన్నారు. చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యటనల్లో తొక్కిసలాట జరిగినా, పీలేరులో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించినా ఆయన పర్యటనలకు అనుమతులు నిరాకరించలేదన్నారు. కానీ వైయస్ జగన్ పర్యటనలపై ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు విధించడం, ఎలా రావాలో ఎక్కడికి రావాలో ప్రభుత్వమే చెప్పడం సిగ్గుచేటన్నారు. ఉత్తరాంధ్రలో వాతావరణం అనుకూలంగా లేదన్న విషయం ప్రభుత్వానికి, పోలీసులకు తెలిసి కూడా హెలిక్యాప్టర్‌లో రావాలనడం విడ్డూరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications