వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..!
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కు ఇవాళ భారీ షాక్ తగిలింది. గతంలో విశాఖ రైల్వే జోన్ కోసం ఆందోళనలు చేసి నిరాహారదీక్షకు దిగిన ఆయనకు ఇవాళ విశాఖ కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ఆయనకు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించాల్సి ఉంది. ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్న వేళ అమర్నాథ్ కు శిక్ష చర్చనీయాంశంగా మారింది.
గతంలో వైఎస్సార్సీపీ విపక్షంలో ఉండగా 2016లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో కలిసి పలు ఆందోళనలు చేశారు. అనంతరం నగరంలోని జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇప్పటివరకూ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్ధానంలోని న్యాయమూర్తి ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే 5వేల రూపాయల జరిమానా కూడా విధించారు.

2016లో గుడివాడ అమర్నాథ్ చేసిన రైల్వే జోన్ నిరాహార దీక్ష కేసులో పదేళ్ల తర్వాత ఇప్పుడు విచారణ పూర్తి చేసి విశాఖ కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. ఈ పదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాల్లో విశాఖ రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడం, కేంద్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేయడం, నిధులు కేటాయించడం, త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు కూడా చేస్తుండటం విశేషం. ఇలాంటి సమయంలో తనకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు గతంలో రైల్వే జోన్ కోసం తాను చేసిన ఉద్యమానికి లభించిన బహుమతిగా అమర్నాథ్ చెప్తున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు.












Click it and Unblock the Notifications