వైఎస్ జగన్ స్టిక్కర్ల అతికింపు వెనుక వైసీపీకి ప్రయోజనాలివే...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు అధికార పార్టీ.. జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఓ భారీ కార్యక్రమం చేపట్టింది. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఈ మాస్ సర్వే చేపట్టినట్లు వైసీపీ అధికారికంగానే ప్రకటించింది. అయితే ఈ స్టిక్కర్ల అతికింపు ద్వారా భారీ ప్రయోజనాల్నే వైసీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి ఇళ్లపై వైఎస్ జగన్ స్టిక్కర్లను అతికించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఊరూవాడా తిరిగేస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం నుంచి పథకాలు అందుకుంటున్న వారి ఇళ్లకు ఈ స్టిక్కర్లు అతికిస్తున్నారు. అయితే పలు చోట్ల ఈ స్టిక్కర్లను అతికించకుండా ఇళ్ల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వైసీపీ నేతలు వెళ్లాక టీడీపీ నేతలు వచ్చి స్టిక్కర్లు అతికిస్తుంటే వారు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఈ స్టిక్కర్ల ద్వారా అధికార పార్టీగా వైసీపీ ఆశిస్తున్న ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ వైఎస్ జగన్ స్టిక్కర్లను అంటించాలన్న వైసీపీ నిర్ణయం వెనుక చాలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఈ స్టిక్కర్ల అతికింపు ద్వారా ఆయా ఇళ్లలో నివసిస్తున్న ఓటర్లంతా వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేస్తారని అధికార పార్టీ భావిస్తోంది. అలాగే వీరిలో స్టిక్కర్ అతికించడానికి ఇష్టపడని వారు వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయరనే అభిప్రాయానికి వస్తోంది. అలాగే సంక్షేమ పథకాల లబ్దిదారులు కాని వారి ఇళ్లపై ఎలాగో స్టిక్కర్ అతికించరు కాబట్టి వారి ఓట్లు తమకు ఎలాగో పడవనే ఆలోచనతో అధికార పార్టీ నేతలు కనిపిస్తున్నారు.
మరోవైపు ఈ స్టిక్కర్లను అతికించేందుకు అనుమతిస్తే రేపు సంక్షేమ పథకాలు అందుతాయని, లేకపోతే పథకాలు తీసేస్తారనే ప్రచారం వాలంటీర్లతో చేయిస్తుండటంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే అధికార పార్టీ నేతలు పెడుతున్న స్టిక్కర్లను అడ్డుకుంటే సమస్యలు తప్పవనే భయం కూడా వారిలో కనిపిస్తోంది. దీంతో ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ వైసీపీ నేతలు స్టిక్కర్లు అతికించేందుకు అనుమతిస్తున్నారు. అయితే పలు చోట్ల వైసీపీ నేతలు వెళ్లాక టీడీపీ నేతలు వచ్చి స్టిక్కర్లు అతికిస్తున్నా వారు మౌనంగానే ఉంటున్నారు. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఇలా సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications