AP Land Titling Act: వివాదాస్పద చట్టంపై వైసీపీ క్లారిటీ-బీజేపీ వల్లేనన్న ధర్మాన..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం వివాదాస్పదంగా మారింది. భూయజమాన్య హక్కులు ఉన్నప్పటికీ పత్రాలను తమకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకోవడంపై లాయర్లతో పాటు భూముల యజమానులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల వేళ జనంలోకి తీసుకెళ్లేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమన్నారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందన్నారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టిందనని, ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఆ దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తామన్నారు.

న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పుల తర్వాత మాత్రమే దీనిపై ఆలోచన చేస్తామని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.అంతవరకూ యాక్ట్ను అమలు చేయమని గతంలోనే స్పష్టంచేశామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు. ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామని, సమగ్ర సర్వేద్వారా ఎంతో మేలు చేకూరుతోందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించామని, దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయని తెలిపారు.
తాము ఇంత చేస్తుంటే విపక్షాలు, చేతకాని దద్దమ్మలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్నారు. జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెప్తుందన్నారు. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా అని అడిగారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా అన్నారు. ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు.
చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్... మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా అని ధర్మాన అడిగారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా అని అడిగారు. రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా అని విపక్షాలను నిలదీశారు. మీ చేతిలో ఉన్నవి ఎల్లోమీడియా మాత్రమే, కాని ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయన్నారు.నిజాలను వారే అందరికీ వివరిస్తారన్నారు.












Click it and Unblock the Notifications