వాలంటీర్లలో టీడీపీ మనుషులు ? నియమించిందీ మేమే-తొలగిస్తామన్న వైసీపీ ఎమ్మెల్యే..
ఏపీలో వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్ధలో టీడీపీ సానుభూతి పరులున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించిన వాలంటీర్ల వ్యవస్ధ అటు అధికార పార్టీతో పాటు ఇటు సంక్షేమ పథకాల లబ్దిదారులకు కూడా ఎంతో ఉపయోగపడుతోంది. అయితే ఇందులో కొందరు టీడీపీ సానుభూతిపరులు కూడా ఉన్నారని ప్రభుత్వం అనుమానిస్తోందా ? ఎన్నికలకు ముందు వీరు తమకు నష్టం చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సదరు వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక హెచ్చరికలు చేశారు.
ఏపీలో వాలంటీర్లలో టీడీపీ సానుభూతిపరులున్నారంటూ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వారిని నియమించిందన్నారు. వాలంటీర్లలో టీడీపీ సానుభూతిపరులు ఉంటే వారిని తక్షణమే తొలగిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామని వసంత తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం టీడీపీ నుంచి కూడా వాలంటీర్లను నియమించిందని వసంత తెలిపారు. వాళ్లే మారుతారులే, వాళ్లు వైసీపీకి అనుకూలంగా తయారవుతారులే అని వేచి చూశామని చెప్పారు. టీడీపీ సానుభూతిపరులైన వాలంటీర్లలో కొందరు మారారని, మరికొందరు మారలేదని అన్నారు. మారనటువంటి వాలంటీర్లను స్థానిక నేతలు గుర్తించి చెపితే వారిని తక్షణమే తొలగిస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు సదరు వాలంటీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.












Click it and Unblock the Notifications