Small Box India opinion Poll: కీలక సర్వే: అధికారంలోకి వచ్చేదెవరు? ప్రతిపక్ష పాత్ర దక్కేదెవరికి?
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంటోంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తరువాత- అధికార బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) తమ ప్రచార కార్యక్రమాలకు మరింత పదునుపెట్టాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను సైతం ప్రకటించాయి. ఈ విషయంలో బీజేపీ వెనుకంజలో ఉంది. అభ్యర్థుల జాబితాపై ఇంకా కసరత్తు కొనసాగిస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అంచనా వేసింది. సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. మొత్తం 224 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 115 నుంచి 127 స్థానాలు దక్కుతాయని, బీజేపీ ఈ దఫా ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని అభిప్రాయపడింది. బీజేపీకి 68 నుంచి 80 వరకు సీట్లు దక్కొచ్చని తెలిపింది. జేడీఎస్‌కు 23 నుంచి 35 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.

జీ న్యూస్ ఒపీనియన్ పోల్ దీనికి కాస్త భిన్నంగా వెలువడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని స్పష్టం చేసింది. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఏ పార్టీకి కూడా రాదని పేర్కొంది. బీజేపీకి 96 నుంచి 106 వరకు సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్- 88 నుంచి 98, జేడీఎస్ 23 నుంచి 33 అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగురవేస్తాయని అభిప్రాయపడింది.
ఇక తాజాగా మరో ఒపీనియన్ పోల్ వెలువడింది. స్మాల్ బాక్స్ ఇండియా సంస్థ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై తాను నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఇదివరకు ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ సంస్థ విడుదల చేసిన ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఢిల్లీ, పంజాబ్ లల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసిందీ సంస్థ. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందనీ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.
ఈ సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఒపీనియన్ పోల్ నిర్వహించింది స్మాల్ బాక్స్ ఇండియా. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ కు 118 నుంచి 129 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని తెలిపింది. బీజేపీ 65 నుంచి 70 సీట్లతో రెండో స్థానానికే పరిమితమౌతుందని పేర్కొంది. ఈ సారి ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటోందని అంచనా వేసింది. జేడీఎస్ 28 నుంచి 32 సీట్లను కైవసం చేసుకుంటుందని వివరించింది. ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు దక్కుతాయని తెలిపింది.












Click it and Unblock the Notifications