ఇంటర్నెట్ స్పీడ్‌లో ఎయిర్టెల్ హవా.. జియోకి ఊహించని షాక్!
హోమ్ ఇంటర్నెట్ వినియోగంలో సబ్స్క్రైబర్ల సంఖ్య పరంగా రిలయన్స్ జియో ముందంజలో ఉన్నప్పటికీ, నెట్వర్క్ వేగం, నాణ్యత విషయంలో మాత్రం భారతి ఎయిర్టెల్ జెండా పాతేసింది. ప్రముఖ నెట్వర్క్ ఎనలిటిక్స్ సంస్థ 'ఓపెన్‌సిగ్నల్' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భారత్‌లోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సేవల పనితీరులో ఎయిర్టెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంటర్నెట్ వేగం, నెట్వర్క్ స్థిరత్వం, వీడియో స్ట్రీమింగ్ అనుభవం వంటి కీలక విభాగాల్లో ఎయిర్టెల్ అత్యుత్తమ రేటింగ్ సాధించి, తన సమీప ప్రత్యర్థులైన జియో, బిఎస్ఎన్ఎల్లను వెనక్కి నెట్టింది.
అన్ని విభాగాల్లోనూ ఎయిర్టెల్ హవా
వినియోగదారులకు అందించే హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఐదు ప్రధాన విభాగాల్లో ఓపెన్‌సిగ్నల్ ఈ పరీక్షలను నిర్వహించింది. బ్రాడ్‌బ్యాండ్ విశ్వసనీయత, స్థిరమైన క్వాలిటీ, డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్, వీడియో ప్లేబ్యాక్ అనుభవాలలో ఎయిర్టెల్ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. నెట్వర్క్ విఫలం కాకుండా స్థిరంగా పనిచేసే విశ్వసనీయత రేటింగ్‌లో ఎయిర్టెల్ 486 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, జియో 423 పాయింట్లు సాధించింది. ఇక డౌన్లోడ్, అప్లోడ్ వేగంలో ఎయిర్టెల్ తన ప్రత్యర్థి జియో కంటే దాదాపు 26 నుంచి 27 శాతం ఎక్కువ స్పీడ్ నమోదు చేసింది.

స్పీడ్ రేసులో గట్టిపోటీ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్
ఈ స్పీడ్ రేసులో ప్రభుత్వ రంగానికి చెందిన బిఎస్ఎన్ఎల్ అనూహ్యంగా అద్భుత పనితీరును కనబరిచింది. వేగం విషయంలో బిఎస్ఎన్ఎల్ ఎయిర్‌టెల్‌కు అతిసమీపంలో నిలిచింది. డౌన్లోడ్ స్పీడ్‌లో ఎయిర్టెల్ కంటే కేవలం 0.5 ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడ్‌లో 0.8 ఎంబీపీఎస్ తేడాతో రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ విభాగంలోనూ జోరు
ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ప్లగ్ అండ్ ప్లే 5జి హోమ్ ఇంటర్నెట్ (ఎయిర్‌ఫైబర్) విభాగంలో కూడా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఎయిర్టెల్ సగటున 32.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని అందించగా, జియో ఎయిర్‌ఫైబర్ 25.7 ఎంబీపీఎస్లకే పరిమితమైంది. అప్లోడ్ వేగంలోనూ ఎయిర్టెల్ 20.7 ఎంబీపీఎస్‌తో ముందుకు నిలిచింది. హై-డెఫినిషన్ (HD) వీడియోలు అంతరాయం లేకుండా ప్లే అయ్యేలా చేసే క్వాలిటీ విభాగంలో ఎయిర్టెల్ 66.2 శాతం స్కోరుతో అత్యుత్తమ ఫలితాలు సాధించింది.
వినియోగదారుల సంఖ్యలో జియోదే పైచేయి
సేవల నాణ్యత, వేగంలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, దేశంలో వినియోగదారుల సంఖ్య పరంగా రిలయన్స్ జియోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత టెలికాం నియామక సంస్థ (ట్రాయ్) గణాంకాల ప్రకారం జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 1.48 కోట్ల మంది చందాదారులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తదుపరి స్థానాల్లో 1.14 కోట్ల చందాదారులతో ఎయిర్టెల్ రెండో స్థానంలో, 46 లక్షల వినియోగదారులతో బిఎస్ఎన్ఎల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.














Click it and Unblock the Notifications
