లోన్ యాప్ అంటారా? ఒక్క క్లిక్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!
ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు మొబైల్ లోన్ యాప్స్ ఎంతో సులభంగా లోన్స్ అందిస్తుననట్లు కనిపిస్తాయి. కొన్ని క్లిక్స్, ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అందించగానే నిమిషాల్లో నగదు జమ చేస్తామనే ఆకర్షణీయమైన ఆఫర్లు చాలా మందిని ప్రశ్నలు అడగకుండా అప్పు తీసుకునేలా చేశాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం అనేక లోన్ యాప్స్ తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు, ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేదనే ప్రచారాలతో వినియోగదారులను వలలో వేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
అప్పు కాదు.. ముందు అప్పు ఇచ్చే సంస్థ గురించి తెలుసుకోండి..
రుణం ఎంత త్వరగా వస్తుందనే దానికంటే అసలు మీకు రుణం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్పష్టత లేని రుణదాత వివరాలు, వడ్డీ రేట్లు, చార్జీలపై సమాచారం లేకపోవడం, ఫోన్ లోని అనవసరమైన సమాచారానికి అనుమతులు అడగడం, ఎటువంటి క్రెడిట్ పరిశీలన లేకుండా తక్షణ ఆమోదం తెలపడం వంటివి నకిలీ యాప్స్ ప్రధాన లక్షణాలు. అద్భుతమైన డిజైన్ లేదా తక్షణ రుణం అని చెప్పినంత మాత్రాన ఆ సంస్థ నిజమైనదని నమ్మకూడదు.

యాప్ స్టోర్ వివరాలను సరిచూసుకోండి..
ఏదైనా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో లభ్యమైనంత మాత్రాన దానిని వెంటనే నమ్మలేం. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు దాని డెవలపర్ పేరు, వివరణ, ప్రైవసీ పాలసీ, కస్టమర్ కేర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వివరాలన్నీ ఆ రుణదాత అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదా చూసుకోవాలి. యాప్ డెవలపర్ వివరాలకు, అధికారిక వెబ్‌సైట్ కు తేడా ఉంటే ఈ యాప్‌కు దూరంగా ఉండటమే మంచిది.
నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా?
మీకు రుణం అందిస్తున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీ ఆర్బీఐ గుర్తింపు పొందిందో లేదో తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా సదరు సంస్థ చట్టబద్ధతను నిర్ధారించుకోవచ్చు. అలాగే ఆర్బీఐ విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ యాప్స్ డైరెక్టరీని పరిశీలించి సదరు యాప్ అనుమతి పొందిన సంస్థతో అనుసంధానమై ఉందో లేదో తెలుసుకోవాలి. కేవలం లోగోలు లేదా పేర్లు చూసి ఏ యాప్‌నూ గుడ్డిగా నమ్మకూడదు.
ఫోన్ కాంటాక్టులు లోన్ గ్యారెంటీ కాదు
రుణ దరఖాస్తు ప్రక్రియతో సంబంధం లేని వివరాలకు అనుమతి అడిగే యాప్స్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ కాంటాక్ట్స్, కాల్ లాగ్స్ లేదా గ్యాలరీని ఫోటోలకు యాక్సెస్ అడిగే యాప్ లను వెంటనే నిలిపివేయాలి. కేవైసీ ప్రక్రియ కోసం కెమెరా అనుమతి అవసరం కావచ్చు. కానీ మిగిలిన ప్రైవేట్ డేటాను ఎందుకు అడుగుతున్నారో ప్రశ్నించాలి. అవసరం లేని డేటాను సేకరించే యాప్స్ తర్వాతి కాలంలో వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది.
తక్కువ వడ్డీ ఆఫర్లలో దాగి ఉన్న అసలు ఖర్చులు
చూడటానికి తక్కువగా కనిపించే వడ్డే రేటు మాత్రమే పూర్తి రుణ వ్యయాన్ని ప్రతిబింబించదు. లోన్ తీసుకునే ముందు మొత్తం వార్షిక ప్రాసెసింగ్ రుసుము, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర దాగి ఉన్న రుసుములు, చెల్లింపు గడువు, తిరిగి చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలను స్పష్టంగా తెలుసుకోవాలి. వడ్డీ రేటుతో పాటు మొత్తం రుణ వ్యయాన్ని అంచనా వేయాలి. అలాగే కేవైసీ లేదా క్రెడిట్ చెక్ కోసం అవసరమైన సున్నితమైన సమాచారాన్ని(పాన్ వివరాలు లేదా ఇతర వివరాలు) కేవలం అధికారిక వేదికలపై మాత్రమే నమోదు చేయాలి. లోన్ తీసుకునే ముందు కొన్ని నిమిషాల సమయం కేటాయించి ఈ జాగ్రత్తలు పాటిస్తే నకిలీ యాప్స్ బారిన పడకుండా ఉండవచ్చు.














Click it and Unblock the Notifications