ఆన్లైన్ లో నో కాస్ట్ ఈఎంఐతో షాపింగ్ చేస్తున్నారా? అయితే అలెర్ట్!
అసలే దసరా , దీపావళి పండుగ రోజులు .. ఆన్ లైన్ షాపింగ్ లో అదిరిపోయే బంపర్ ఆఫర్లు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో ఇలా అనేక ఈ కామర్స్ సైట్స్ లో ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్లు చాలామంది "నో కాస్ట్ ఈఎంఐ" అన్న పదం చూస్తేనే ఆకర్షితులవుతారు. వడ్డీ లేకుండా నెలవారీ వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చని అనిపిస్తుంది. ల్యాప్టాప్, మొబైల్, టీవీ లాంటి ఖరీదైన వస్తువులు కావాలనుకునేవాళ్లకు ఇది చాలా సౌకర్యంగా కనిపిస్తుంది.
కానీ ఈ ఆఫర్ వెనుక కొన్ని విషయాలు దాగి ఉంటాయి. అవి తెలుసుకుంటే మాత్రమే మీరు నష్టపోకుండా ఉండగలరు.నో కాస్ట్ ఈఎంఐ అంటే వినియోగదారుడు వడ్డీ చెల్లించనవసరం లేదని చెప్తారు. అసలు వడ్డీని తయారీదారు లేదా విక్రేత భరిస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తులు అమ్ముకోవడం ద్వారా వచ్చే లాభంలో ఆ వడ్డీని భరించవచ్చని వారు అనుకుంటారు. కానీ ఈ వడ్డీ పూర్తిగా వారే భరించరు. అది వస్తువు ధరలోనే కలిసి ఉంటుంది.

ఉదాహరణకు ఒక ల్యాప్టాప్ అసలు ధర రూ. లక్ష అనుకుందాం. ఆరు నెలల ఈఎంఐకి 12 శాతం వడ్డీ రేటు ఉంటే సాధారణంగా రూ. ఆరు వేలు వడ్డీ అవుతుంది. నో కాస్ట్ ఈఎంఐలో ఆ ఆరు వేలను ధరలో కలిపి మొత్తం రూ. లక్ష ఆరు వేలుగా చూపిస్తారు. మీరు ఆ మొత్తాన్నే చెల్లిస్తారు. వడ్డీ విడిగా కనిపించదు కాబట్టి చాలామంది దీన్ని గమనించరు.
మరో ముఖ్యమైన విషయం - క్యాష్లో కొంటే లభించే రాయితీలు ఈఎంఐ ఎంచుకుంటే రావు. క్రెడిట్ కార్డుతో ఒకేసారి పూర్తి మొత్తం చెల్లిస్తే భారీ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు వస్తాయి. కానీ నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే ఆ ఆఫర్లు వర్తించవు. ఫలితంగా మీరు ఎక్కువ డబ్బు చెల్లించినట్టే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి కూడా వస్తాయి.
వడ్డీ మాఫీ అయినా ఆ వడ్డీ భాగంపై 18 శాతం జీఎస్టీ మీరే చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తమే అయినా మొత్తం ఖర్చును పెంచుతుంది. ఖరీదైన వస్తువులు కొనాలనుకునేటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించలేని పరిస్థితుల్లో నో కాస్ట్ ఈఎంఐ ఉపయోగపడుతుంది. సాధారణ క్రెడిట్ కార్డు ఈఎంఐలతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో ఉంటుంది. కానీ పూర్తిగా ఉచితం కాదు. మీ క్రెడిట్ లిమిట్ మొత్తం బ్లాక్ అవుతుంది.
భవిష్యత్తులో మరో లోన్ తీసుకోవాలనుకుంటే సమస్య కావచ్చు. అంతేకాదు, నెలవారీ వాయిదాలు చాలా ఉంటే ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈఎంఐ ఎంచుకునే ముందు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూడాలి. ముందుగా క్యాష్ ధర ఎంతో, ఈఎంఐ ధర ఎంతో పోల్చి చూడండి. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు ఉన్నాయా అని తనిఖీ చేయండి. నియమాలు, నిబంధనలు పూర్తిగా చదవండి. మీకు నిజంగా అవసరమైనప్పుడు, బడ్జెట్ లోపల ఉండే విధంగా మాత్రమే ఈఎంఐ తీసుకోండి. అలా చేస్తే మీరు నష్టపోకుండా, సౌకర్యంగా కొనుగోలు చేయవచ్చు.














Click it and Unblock the Notifications
