తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్- ఇలా చేయండి..!!
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. కాగా.. దసరా చివరి మూడు రోజల్లో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, రేపు గరుడ సేవ వేళ భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేస్తోంది.
తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. తిరుమలకు రోజుకు 80 వేల మందికిపైగా భక్తులు వస్తున్నప్పటికీ, దర్శన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. క్యూలైన్లోకి ప్రవేశించినప్పటి నుంచి స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వచ్చే వరకు మూడున్నర గంటల్లోపే పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా క్యూకాంప్లెక్స్-1, 2ల్లోని కంపార్టుమెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షి స్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, ఆర్మీ సిబ్బంది తదితరులకు కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసారు.

గరుడ సేవ వేళ ప్రత్యేక చర్యలు
కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ సేవ తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరమలకు రానున్నారు. దీంతో.. అక్టోబర్ 16న తిరుమల కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధించింది. కార్లు, ద్విచక్ర వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తిరుపతి లోనే వాటిని పార్కింగ్ చేసి, ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని సూచిస్తోంది. కాగా.. వీరికి తిరుపతి నగరంలో 5 ప్రాంతాల్లో పార్కింగ్ మైదానాలను అధికారులు సిద్ధం చేశారు. ఆయా ప్రదేశాలకు సులభంగా చేరుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కోడ్లతో కూడిన బ్యానర్లను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహన రకానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రదేశానికి సంబంధించిన రూట్మ్యాప్ కనిపిస్తుందని.. టీటీడీ సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
