తుఫాను తీవ్రరూపం! రన్‌వేపైనే నిలిచిపోయిన విమానాలు
బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న 'మురసు' తీవ్ర తుఫానుగా మారి వణికిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం అంతటా ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో భోగాపురం నుంచి సర్వీసులు నడిపే ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' తన విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, వీస్తున్న పెనుగాలుల కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
ప్రయాణికులకు హెచ్చరిక: రన్‌వే పైనే వేచి చూడాల్సిందే!
విశాఖలో వాతావరణం తీవ్రంగా దెబ్బతినడంతో విమానాల రాకపోకలపై స్పష్టత లేకుండా పోయింది. రన్‌వేపై విమానాల్లో ఉన్న ప్రయాణికులతో పాటు టెర్మినల్ లోపల వేచి ఉన్నవారు కూడా కొంత సమయం ఓపిక పట్టక తప్పదని ఇండిగో సంస్థ తెలిపింది. ప్రయాణికులు తమ విమానాల తాజా వివరాలను ఎప్పటికప్పుడు ఇండిగో అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది. ఎయిర్‌పోర్టులో ఉన్న సిబ్బంది, క్రూ మెంబర్స్ ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.

బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం!
విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి మురసు తుఫానుగా రూపాంతరం చెందింది. ఇది నవంబర్ 3న ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు దక్షిణ కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు
తుఫాను తీవ్రతను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సోమవారం నాటి ఢిల్లీ పర్యటనను అత్యవసరంగా రద్దు చేసుకున్నారు. అమరావతి నుంచే ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా నివారణ, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.













Click it and Unblock the Notifications
