12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు- ఎల్లో అలర్ట్..!!
Chennai rains: బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో కొద్దిరోజుల కిందట ఏర్పడిన ఈ ఆవర్తనం తాజాగా అల్పపీడనంగా మారింది. సముద్రతలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు- మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. క్రమంగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి, శ్రీలంక వైపు కదులుతోంది

దీని ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 15, 16 తేదీల వరకు యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది.
ఈ అల్పపీడన ప్రభావం ఇప్పటికే తమిళనాడుపై తీవ్రంగా పడింది. సోమవారం రాత్రి నుంచి చెన్నైలో ఏకధాటిగా భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడు కావడంతో కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాత్రంతా భారీ వర్షం దంచికొట్టిన నేపథ్యంలో చెన్నై పాలన యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై సిటీ పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ జగడే ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 15వ తేదీ వరకు భారీ వర్షాల తీవ్రత ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు అధికార యంత్రాంగాన్నీ అప్రమత్తం చేసింది. చెన్నై సహా 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఉత్తర ప్రాంత జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్, దక్షిణ ప్రాంతంలోని విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.












Click it and Unblock the Notifications