ఏలూరు ఎన్నికలపై టెన్షన్-హైకోర్టులో సర్కార్ పిటిషన్- అటు యథావిధిగా ఏర్పాట్లు
ఏలూరులో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటలే మిగిలున్న నేపథ్యంలో ఎన్నికలు నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కలకలం రేపాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు నగర పాలక సంస్దలో ఎన్నికలకు బ్రేక్ పడినట్లయింది. ఓటర్ల జాబితాలో అక్రమాలను సవరించకుండా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఎన్నికలను నిలిపివేస్తూ నిన్న మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
ఏలూరు నగర పాలక సంస్దలో ఎన్నికలను నిలిపివేస్తూ జస్టిస్ సోమయాజులు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ప్రభుత్వంతో పాటు మరో ఇద్దరు పిటిషనర్లు కూడా వేర్వేరు అంశాలపై వాజ్యాలు దాఖలు చేశారు. డివిజన్ బెంచ్‌లో లంచ్ మోషన్‌లో వీటిని విచారించాలని పిటిషనర్లు కోరారు. దీంతో డివిజన్ బెంచ్ ఇచ్చే ఉత్తర్వులు ఇప్పుడు కీలకంగా మారాయి.

ఏలూరు నగర పాలక సంస్దకు జరగాల్సిన ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితాలో అక్రమాలపై గతేడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని సవరించాక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని గతేడాది సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే మున్సిపల్ అధికారులు హడావిడిగా వీటిని సవరించి ఎస్ఈకీ సమర్పించారు. వీటి ఆధారంగా గతంలో ఎస్ఈసీ ఏలూరులో ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అయితే సవరించిన తర్వాత కూడా అవే తప్పిదాలు ఉండటంతో పిటిషనర్లు హైకోర్టును తిరిగి ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు నిలిపేస్తూ నిన్న ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఎన్నికలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎస్ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ల తర్వాత వచ్చే తీర్పు ఆధారంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకూ ఏర్పాట్లు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications