317కి చేరిన బాధితులు... ఏలూరులో విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధి... ఇంకా అంతుచిక్కని కారణాలు...
ఏలూరును అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం(డిసెంబర్ 7) రాత్రి వరకు దాదాపు 317 మంది ఆస్పత్రిపాలయ్యారు. శనివారం(డిసెంబర్ 5) వెలుగుచూసిన ఈ మిస్టరీ వ్యాధి వైద్యులకు సవాల్‌గా మారింది. ఆస్పత్రిపాలైన వారిలో శ్రీధర్(45) అనే బాధితుడు మరణించడం కలకలం రేపింది. రెండు రోజులుగా బాధితుల సంఖ్య పెరుగుతున్నా... ఇప్పటికీ దీనికి సంబంధించి ఏ చిన్న క్లూ దొరక్కపోవడం విస్తుపోయేలా చేస్తోంది.

అత్యధికులు ఆ వయసువారే...
శనివారం అర్ధరాత్రి వరకూ 108 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా... ఆదివారం రాత్రి వరకూ ఆ సంఖ్య 317కి చేరడం గమనార్హం. బాధితుల్లో అత్యధికులు 20-30ఏళ్ల లోపు వారు కాగా... 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకూ 180 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బాధితులకు ఇదివరకూ ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా... ఉన్నట్లుండి మూర్ఛకు గురవడం అంతుచిక్కనిదిగా మారింది.

మరిన్ని కాలనీలకు విస్తరించిన వ్యాధి..
శనివారం ఏలూరు పట్టణంలోని పడమరవీధి,తాపీమేస్త్రీ కాలనీ,శనివారం పేట,ఆదివారం పేట,కొత్తపేట,అరుంధతీ పేట స్థానికులు అస్వస్థతకు గురవగా... ఆదివారం మరికొన్ని కాలనీలకు ఈ వ్యాధి విస్తరించింది. ఇందిరమ్మ కాలనీ,మరడాని రంగారావు కాలనీ,వైఎస్ఆర్ కాలనీలకు చెందిన స్థానికులు ఆదివారం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. దెందులూరు పరిధిలోని కేదవరానికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా వింత వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన కొద్దిసేపటికే వారు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

విజయవాడ ఆస్పత్రికి తరలింపు...
మొత్తం 30 మంది వైద్యులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఆదివారం ఆయన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి విషమించినవారిని విజయవాడ,గుంటూరు జీజీహెచ్‌లకు తరించినట్లు ఏలూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మోహన్ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ ఆస్పత్రిలో సురేష్(24),అనురాధ(27),ప్రభ(6),సింహాచలమ్మ(80) చికిత్స పొందుతున్నారు.
Recommended Video

అంతుచిక్కని కారణాలు...
చలపతిరావు(65),లక్ష్మీ కుమారి(55),కుసుమ కుమారి(42),రమణమ్మ(59)లను గుంటూరు జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. ఏలూరులో వెలుగుచూసిన ఈ వ్యాధి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓవైపు కరోనా ఇంకా పూర్తిగా తగ్గకముందే... మరో మిస్టరీ వ్యాధి ప్రజలను అస్వస్థతకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోంది. కలుషిత మంచినీరే దీనికి కారణం కావొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications