జగన్ గోత్ర నామం.. జన్మనక్షత్రం ఇదే: వైభవంగా గోపూజ..ప్రదక్షిణ: అన్యమతస్తుడనే విమర్శలకు చెక్
గుంటూరు: కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల మతం చుట్టూ తిరుగుతున్నాయి. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం అనంతరం ఈ మత రాజకీయాలు మరింత ఉధృతం అయ్యాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకుల ఫోకస్ మొత్తం హిందుత్వం మీదే నిలిచింది. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాలను సింగిల్ అజెండాగా చేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరించడం ఒక ఎత్తయితే.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికను ఎదుర్కొనబోతోండటం మరో ఎత్తు.
Recommended Video


హిందుత్వ అజెండాలోకి..
మతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని కొనసాగుతోన్న రాజకీయ దాడిని తట్టుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రత్యేకించి- వైఎస్ జగన్.. తాను అందరివాడినని నిరూపించుకోవడానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోవడానికి ఇష్టపడట్లేదు. తాను ఏ ఒక్క మతానికో లేక ఏ ఒక్క సామాజిక వర్గానికో పరిమితమైన నేతను కాదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయాలు, విగ్రహాలపై చోటు చేసుకుంటోన్న దాడులపై తక్షణమే స్పందిస్తున్నారు. ఆయా సంఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించడానికీ వెనుకాడట్లేదు.

సంప్రదాయబద్ధంగా గోపూజ..
విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో మూలవిరాట్టు శ్రీరామచంద్రులవారి విగ్రహం విధ్వంసం ఉదంతం ఆరా తీయడానికి సీబీడీని రంగంలోకి దించింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ప్రకటించిన తరువాత.. దానికి అనుగుణంగా ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలను చోటు చేసుకుంటున్నాయంటూ ఆయన ప్రతిపక్షాలపై ఎదరుదాడికీ దిగారు. దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. కనుమ నాడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన గోపూజ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు.

జగన్ గోత్రనామం ఏదంటే..
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్.. సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు నిర్వహించిన గోపూజను దగ్గరుండి నిర్వహించారు. గోప్రదక్షిణ చేశారు. తన చేతులతో హారతినిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గోత్ర నామం, జన్మనక్షత్రం మీద గోపూజను నిర్వహించారు. తన గోత్రనామాన్ని, జన్మనక్షత్రాన్ని ఆయన వెల్లడించారు. జగన్‌ది కుంబాల గోత్రం.. ఆరుద్ర నక్షత్రం. ఈ రెండింటి పేరు మీద గోపూజ నిర్వహించారు టీటీడీ అర్చకులు.