చంద్రబాబు సభలో ముగ్గురు మృతి చెందిన ఘటనలో ఏ1 అరెస్ట్..!!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సదాశివ నగర్ వికాస్ హాస్టల్ గ్రౌండ్స్ లో ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆయనే.
ఈ చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సహకారంతో చేపట్టిన ఉయ్యూరు ఫౌండేషన్ కు ఉయ్యూరు శ్రీనివాస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్నారు. ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎంత మంది వస్తారనేది ముందే తెలిసినప్పటికీ- దానికి అనుగుణంగా సభను నిర్వహించడంలో విఫలం అయ్యారనే కారణంతో గుంటూరు నల్లపాడు పోలీసులు ఉయ్యూరు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

తొక్కిసలాట అనంతరం ఉయ్యూరు శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. దీనితో ఆయన కోసం గుంటూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా గాలింపు చర్యలను మొదలు పెట్టారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన గురించి ఆరా తీశారు పోలీసులు. ఏలూరులో ఉయ్యూరు శ్రీనివాస్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. కొద్దిసేపటి కిందటే అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్ కు పేరుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కార్యనిర్వాహక సభ్యుడిగా పని చేశారాయన. తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లను నెలకొల్పారు. తాజాగా ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు పెట్టారు.












Click it and Unblock the Notifications