మేడమ్ .. కొరియర్.. డోర్ ఓపెన్ చేసిన మహిళ షాక్; అసలేం జరిగిందంటే..
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దోపిడి దొంగలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎప్పుడు, ఎలా దొంగతనాలకు పాల్పడుతున్నారో అర్థంకాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రోజుకో కొత్త రకంగా పట్టపగలు, ఇంటిలోకి నేరుగా చొరబడి దోపిడీలకు పాల్పడేవారు తయారవుతున్నారు. రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిని టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వారు కొందరైతే, ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్ళు చూసి, రెక్కీ వేసి తెలివిగా చోరీ చేస్తున్నవారు మరికొందరు.
ఇక ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు కొరియర్ వచ్చిందని తలుపు తట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వైనం కూడా తాజాగా వెలుగుచూసింది. అటువంటి ఘటన పేట్ బషీరాబాద్ లో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ లో రామచంద్ర రావు దంపతులు నివసిస్తున్నారు. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఒంటరిగా ఉన్నప్పుడు కొరియర్ వచ్చిందంటూ ఇంటి తలుపు కొట్టాడు.

కొరియర్ బాయ్ వచ్చాడని గుర్తించిన సదరు మహిళ తలుపు తీసి తాము ఎటువంటి వస్తువును కొరియర్ పెట్టలేదని చెప్పేలోపే, సదరు దుండగుడు మహిళ గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. చంపేస్తానని భయ పెట్టడంతో, బాధితురాలు తనను చంపవద్దని దుండగుడిని వేడుకుంది. దీంతో ఆమె మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడు తీసుకొని ఆమె అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి పరారయ్యాడు.
దీంతో అప్పుడే ఇంటికి వచ్చిన భర్త ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి భార్య నోటికి టేప్ వేసి ఉండడంతో గమనించి ఖంగుతిన్నాడు. వెంటనే ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ ను తొలగించి ఏం జరిగింది అని ప్రశ్నించగా బాధితురాలు జరిగిన సంఘటనను వివరించింది. దీంతో భర్త రామచంద్రరావు పోలీసులకు కొరియర్ బాయ్ పేరుతో తన ఇంట్లో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా కొరియర్ పేరుతో వచ్చే వారి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ తరహా దొంగతనాలు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications