బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.. అందుకే దాడులు..!
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన విగ్రహం పాడయిపోయినందున.. దాని స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయబోతుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు.
పోరాట యోధురాలైన రాణి అవంతీబాయి విగ్రహం పదేళ్ల నుంచి అక్కడే ఉందని.. పాత దాని స్థానంలో కొత్త విగ్రహం ఏర్పాటు చేయబోతుంటే ఇంత రాద్ధాంతం ఎందుకన్నారు. ఆ విగ్రహంతో ఇన్నేళ్లుగా ఎవరికి ఏ సమస్య రాలేదని.. ఇప్పుడు కొత్త విగ్రహం నెలకొల్పే క్రమంలో అలజడి సృష్టించడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు.

తనకు తానుగా రాయితో కొట్టుకున్నానని డీసీపీ ప్రకటించడం విడ్డూరమన్నారు రాజాసింగ్. పోలీసులు మొదట లాఠీఛార్జి చేసిన తర్వాతే లాఠీలతో ఏం కొడతారులే.. పెద్ద రాయితో కొట్టండని వారి చేతికి ఇచ్చానని వివరించారు. రాయితో కొట్టుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు.
అదలావుంటే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై జరిగిన దాడిని తమ పార్టీ ఖండిస్తోందని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు. ఇలాంటి దాడుల వల్ల బీజేపీ ఎదుగుదలను ఆపాలని చూడటం అవివేకమన్నారు. రాజాసింగ్‌పై దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు మురళీధర్ రావు. ఆయనపై జరిగిన దాడిని జాతీయ స్థాయిలో చర్చించే అంశంగా తాము భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications