మాదాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య; నగరంలో మళ్ళీ గ్యాంగ్ వార్!!
మాదాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ పాయింట్ వద్ద ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే ఒక రౌడీ షీటర్ ను దారుణంగా హతమార్చిన ఘటన సంచలనంగా మారింది.
రౌడీ షీటర్ ఇస్మాయిల్ పై మరో రౌడీషీటర్ పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ తో కాల్పులు జరిపారు.
నీరూస్ సిగ్నల్ వద్ద కారులో ఇస్మాయిల్ విగాతజీవిగా పడి ఉన్నాడు. ఇస్మాయిల్ కారులో వెళుతుండగా, మజ్జు అనే వ్యక్తి నీరూస్ వద్దకు రాగానే ఇస్మాయిల్ ను హతమార్చారా? లేక ఎక్కడైనా హతమార్చి కారుని ఇక్కడ వదిలి వెళ్లారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇస్మాయిల్, మజ్జు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ మజ్జు ఇస్మాయిల్ పై కాల్పులు జరిపాడు. ఊహించని పరిణామంతో రౌడీ షీటర్ ఇస్మాయిల్ అక్కడ నుండి తప్పించుకోలేక పోయారు. ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీసీపీ పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి ప్రాథమిక ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఇస్మాయిల్ ను హతమార్చిన మజ్జు, ఇస్మాయిల్ కు స్నేహితుడే నని తెలుస్తుంది. వీరిద్దరికీ జైల్లో పరిచయం ఏర్పడిందని సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ ఒక ముఠాగా ఏర్పడి ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరికీ డబ్బు పంపకం విషయంలో తేడా ఏర్పడడంతో మనస్పర్థలు తలెత్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ఎక్కడో చంపి ఇస్మాయిల్ శవాన్ని పడేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరె మైసమ్మ ఆలయ సమీపంలో మజ్జు నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంతేకాదు మజ్జు వద్ద పిస్టల్ ఎక్కడిది? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది ? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనతో మళ్ళీ నగరంలో గ్యాంగ్ వార్ కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications