మరోసారి మోడీ లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు: ఈటల రాజేందర్ సూచన పాటిస్తామన్న సీఎం
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని.. కానీ, ప్రజలు ఓడిపోతున్నారని వ్యాఖ్యానించారు.

ఏదో చేస్తారని మోడీని గెలిపించారన్న కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో బీజేపీ, మోడీలకు ఓటు వేస్తే.. వాళ్లు గెలిచారని.. భారతదేశ ప్రజలు ఓడిపోయారని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలపై ప్రజా జీవితంలో ఉన్న వారు చర్చించాలన్నారు. అలాంటివాటికే పవిత్ర దేవాలయం ఈ శాసనసభ అని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. ఒకటి కూడా రాలేదన్నారు. నర్సింగ్ కాలేజీలు కూడా రాలేదన్నారు.

ఈటల రాజేందర్ సూచనలు తీసుకుంటామన్న కేసీఆర్
కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ అనేక విషయాలను ప్రస్తావించారన్నారు. వాటిని స్వాగతిస్తామని, వాటిపై చర్చిస్తామని కేసీఆర్ చెప్పారు. మనకు రావాల్సిన రూ. 495 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసి.. ఏడేళ్లుగా అడుగుతున్నా ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వనని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడారని.. అదే ఇక్కడకు తీసుకొచ్చిందన్నారు.

మోడీ కంటే మన్మోహన్ సింగ్ బెటరన్న కేసీఆర్
దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు కేసీఆర్. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 20 లక్షల మంది సిటిజన్ షిప్ వదులుకున్నారని ఆరోపించారు. మోడీ కంటే మన్మోహన్ సింగ్ ఎక్కువ పనిచేశారని చెప్పుకొచ్చారు కేసీఆర్. బీజేపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా పారిపోతున్నారన్నారు. దేశంలో అన్ని వనరులున్నా.. దమ్మున్న నాయకుడు లేకపోవడంతోనే ప్రజలకు 24 గంటల విద్యుత్, ఇంటింటికీ నీరు అందించలేకపోతున్నామన్నారు. బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు పిచ్చోళ్ల చేతిలో ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. ఇక తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు. ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు.












Click it and Unblock the Notifications