వైఎస్ షర్మిల అరెస్ట్‌పై స్పందించిన గవర్నర్ తమిళిసై; ఆ దృశ్యాలు మనసు కలచివేశాయని వ్యాఖ్య!!
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. వైయస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమెను కారుతో సహా క్రేన్ తో లిఫ్ట్ చేసి తీసుకు వెళ్లడం ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. పాదయాత్ర చేస్తున్న షర్మిల వాహనాన్ని తగలబెట్టి, దాడికి పాల్పడిన ఘటన, ఆపై ఆమెను అరెస్ట్ చేసిన ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ నుండి, బిజెపి నుండి పలువురు షర్మిల అరెస్టును ఖండించారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైయస్ షర్మిల అరెస్టుపై, తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలపై స్పందించారు. రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా మహిళల గౌరవించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన తీరు, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు తన ట్వీట్ ను షర్మిలతో పాటు తెలంగాణా డీజీపీకి, పీఎంఓ కు ట్యాగ్ చేశారు.

వైయస్ షర్మిల కార్లో కూర్చొని ఉండగానే కారు లోపల ఉన్న షర్మిల ను క్రేన్ సహాయంతో లాక్కెళ్ళిన దృశ్యాలు తన మనస్సును కలచివేశాయని గవర్నర్ తమిళిసై తెలిపారు. చాలా అమానుషంగా షర్మిల ను అరెస్ట్ చేశారని, షర్మిల అరెస్టును తప్పుబట్టిన గవర్నర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు మంచిది కాదన్నారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు కానీ, మహిళా నాయకులు మహిళా కార్యకర్తలను గౌరవంగా చూడాల్సిన బాధ్యత, అవసరం ఉన్నాయని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పేర్కొన్నారు.
వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022
ఆమె కారు లోపల ఉన్నప్పుడు
ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి.@realyssharmila @PMOIndia @TelanganaDGP
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్న సమయంలో, షర్మిల అరెస్ట్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం పై, పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం అయినట్టుగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications