పురపోరులో గెలిచేది కాంగ్రెసే.. కేటీఆర్ కామెంట్లే నిదర్శనమన్న కోమటిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనవేయబోమంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీని తక్కువ చేసి చూపేందుకే కేటీఆర్ కాంగ్రెస్ పేరు వాడుకున్నారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎన్నో ఆటుపోట్లు చూసిందని, ఆ పార్టీని తక్కువగా అంచనావేయబోమని అన్నారు. కేటీఆర్ కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
మా సత్తా తెలుసు కాబట్టే..
దేశంలోనేకాదు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో కేటీఆర్ కు తెలుసుకాబట్టే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని కోమటిరెడ్డి అన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్ గురించి తెల్సుకుంటే మంచిదని, అడ్డగోలుగా మాట్లాడటం మానుకుంటే ఉత్తమమని సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

చేసిందంతా మేమే..
తెలంగాణలో మౌళిక సదుపాయాల నుంచి ఐడీ డెవలప్మెంట్ దాకా అన్ని పనులు చేసింది కాంగ్రెస్ పార్టీనేఅని కోమటిరెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెల్చుకుంటుందని వెంకట రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications