భవిష్యత్‌లో హైదరాబాద్ నిమ్స్ ఇలా ఉంటుంది
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను తెలంగాణ ప్రభుత్వం విస్తరించనుంది. ఇప్పుడున్న 1,500 పడకల సామర్థ్యాన్ని పెంచబోతోంది. అదనంగా ఒకేసారి 2,000 పడకలను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. 2,000 పడకల సామర్థ్యంతో కూడిన నిమ్స్ ఆసుపత్రి కొత్త భవన సముదాయం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.
నిమ్స్ విస్తరణపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక బ్లాకులు ఉండేలా కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. మూడు ప్రత్యేక బ్లాకులను ప్రభుత్వం నిర్మించనుంది. మొత్తం ఎనిమిది అంతస్తుల్లో ఇది నిర్మితం కానుంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి నిమ్స్ విస్తరణను చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం.

సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం కూడా పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా- ఒక్క నిమ్స్ ఆసుపత్రి భవన సముదాయంలోనే మొత్తం అందుబాటులో ఉండే పడకల సంఖ్య 3,700కు చేరుకుంటుంది. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలంటూ మంత్రి హరీష్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీష్ రావు ఆదేశించారు. ఇది పూర్తయితే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుంది. హైదరాబాద్ శివార్లల్లో వెయ్యి పడకల సామర్థ్యం గల తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రుల విస్తరణ పనులను వేగవతం చేయాలని మంత్రి అన్నారు.

మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రెయిన్ డెడ్‌కు గురైన వారి నుంచి డిక్లరేషన్లను స్వీకరించాలని, వాటి అవసరం ఉన్న వారికి అవయవాలను మార్పిడి చేసి, ప్రాణదానం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.












Click it and Unblock the Notifications