శభాష్ కోమటిరెడ్డి.. ఆటో డ్రైవర్ కూతురికి సాయం.. పైలట్ శిక్షణ కోసం రూ.2 లక్షలు
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. పైలెట్ కావాలనుకున్న ఓ ఆటోడ్రైవర్ కుమార్తె ఆశయానికి చేయూతనిచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన బోడా అమృతవర్షిణి పేద కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి ఓ ఆటోడ్రైవర్. పైలెట్ కోర్సు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అయినప్పటికీ విమానం నడపాలనే ఆకాంక్షతో ఆమె పైలెట్ అవ్వాలని నిశ్చయించుకుంది. తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనీ పైలెట్ గా అడ్మిషన్ సాధించింది.
ఫీజుల రూపంలో ఖర్చులు చాలా ఉండడంతో అమృతవర్షిణి ఆర్థికసాయం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసింది. ఆయన ఎంతో ఉదారంగా స్పందించి, ఆమె కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలో ఆమెకు రూ.2 లక్షల చెక్ ను అందించారు. ఇలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు సాయపడేలా తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం తీసుకురాకపోవడం దురదృష్టకరమని కోమటిరెడ్డి అన్నారు.

ఆమె సాయం కోసం అధికార పార్టీ నేతలను చాలామందిని కలిసిందని గుర్తుచేశారు. ఎవరూ స్పందించలేదని వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా తాను కర్తవ్యాన్ని నిర్వర్తించానని కోమటిరెడ్డి తెలిపారు. ఓ ఆటోడ్రైవర్ కుమార్తె పైలెట్ అవడాన్ని గర్వంగా భావిస్తానని పేర్కొన్నారు. తనవంతుగా హెల్ప్ చేశానని ఆయన వెల్లడించారు. నిజానికి కోమటిరెడ్డి చేసింది చాలా మంచి పని. తనను కలిసిన యువతికి ఆయన తగిన సాయం చేశారు. మిగతా నేతలకు ఆదర్శంగా నిలిచారు.
కోమటిరెడ్డి చేసిన మంచి పని మిగతా మంచి చేయాలని అనుకునేవారికి ప్రేరణ కలిగిస్తోంది. పేద విద్యార్థినికి కోమటిరెడ్డి నిండు మనస్సుతో సాయం చేశారు. అధికార పార్టీ సాయం చేస్తే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తనను కలవడంతో తోచిన మేరకు హెల్ప్ చేశానని చెప్పారు. ఆ విద్యార్థిని మంచి ప్రయోజకురాలు అయితే తమకు సంతోషంగా ఉంటుందని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మిగతా వారు కూడా ఎంచుకున్న రంగాల్లో రాణించాలని కోరుకున్నారు. వారికి సర్కారే సాయం చేస్తే మరింత మంచిదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు నేతల వద్దకు రారని.. కొందరికే సాయం చేయడం వీలువుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications