మోడీని తిట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టారా?: కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ ఫైర్
ప్రధాని నరేంద్ర మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీలో ప్రజల సమస్యలను మరిచి.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మోడీ గురించి మాట్లాడటం సభ ఉల్లంఘనే: బండి సంజయ్
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్రం నిధుల గురించి గతంలో విసిరిన సవాల్‌కు ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. అసెంబ్లీలో ప్రధాని మోడీ లేనప్పుడు ఆయన గురించి మాట్లాడటం సభ ఉల్లంఘనేనని, వారిపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 100 గదులతో ప్రగతిభవన్ నిర్మించుకున్న కేసీఆర్‌కు.. గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజలు కనబటం లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు బండి సంజయ్.

మోడీని తిట్టేందుకునే? సమస్యలపై చర్చేది?: బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయక రూ. 100 కోట్ల నష్టం వాటిల్లుందని బండి సంజయ్ తెలిపారు. బిల్లుల వసూలుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడి ఘటనలో కూడా అక్కడ జరిగాయన్నారు. లిక్కర్ స్కాం చేసిన కవిత.. చెన్నైకి వెళ్లి స్పీచులు ఇస్తోందని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ రైతుల కోసం భీమా యోజన ప్రవేశపెట్టిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చించకుండా మోడీని తిట్టుకుంటూ సభ నడిపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. కోర్టుకు వెళ్లారని బీజేపీని బద్నాం చేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయం మార్చుతామన్న బండి
రాష్ట్రంలో పోలీస్ అధికారులకు సీనియారిటీ ప్రకారం పోస్టులు లేవని, చెంచాగిరి చేసినవారికి, అర్హత లేని వారికి పోస్టులున్నాయని ఆరోపించారు.
మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు కూడా మోడీ ప్రభుత్వం నిధులే వస్తున్నాయని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నూతన సచివాలయాన్ని మార్చుతామన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న శక్తి కేంద్రాల ద్వారా పార్టీని పటిష్టపరచి ఎన్నికలకు సిద్ధంగా ఉంచాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పూదరి అరుణ, తుల ఉమ, సాంబారి ప్రబాకర్, జిల్లా ప్రెసిడెంట్ పైడిపల్లి సత్యనారాయణ, సెక్రటరీ మధుకర్, శీలం వేణుగోపాల్, కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ వెంకట్, సునీత, సుఖేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications