priyanka reddy murder: అమాయకురాలు.. భయపడింది కానీ..: డీకే అరుణ
Recommended Video
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. హైవేలపై 24గంటలపాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడేం చేసిందో చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను డీకే అరుణ పరామర్శించారు.

ఏ మహిళకూ జరగకూడదు..
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక లాంటి ఘటన ఏ మహిళకు జరగకూడదని అన్నారు. ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నామని ఆమె ప్రశ్నించారు. తనకు కూడా ముగ్గురు కుమార్తెలు అని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడం లేదని అన్నారు.

పోలీసులు స్పందించకపోవడం వల్లే..
ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించలేదని అన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉంటేనే పోలీసులు స్పందిస్తున్నారని అన్నారు. మామూలు వాళ్లు వెళితే పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. వారు సరైన సమయంలో స్పందించివుంటే ప్రియాంక ప్రాణాలతో దక్కేదన్నారు.

అలాంటి పరిస్థితిలో.. భయపడింది కానీ..
ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ప్రియాంక తన చెల్లెలికి బదులు పోలీసులకు ఫోన్ చేయాల్సిందని హోంమంత్రి వ్యాఖ్యానించడంపై డీకే అరుణ మండిపడ్డారు. ఆ సమయంలో పోలీసులకు ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. అమాయకురాలైన ఆ అమ్మాయికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. వెహికిల్ పంక్చర్ అవడంతో వారు సహాయం చేస్తున్నారని అనుకుందన్నారు. ట్రాప్ చేస్తున్నారని అనుకోలేదని, కానీ, భయపడిందని తెలిపారు.

ప్రియాంక నోరునొక్కి ఘాతుకం..
టోల్ గేట్‌కి నాలుగు అడుగుల దూరంలోనే ఈ ఘోరం జరిగిందని డీకే అరుణ చెప్పారు. నలుగురు నిందితులు బలవంతంగా ఆమె నోరు నొక్కి ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఆమెను గమనించి ప్లాన్ ప్రకారమే నిందితులు ఈ ఘోరానికి తెగబడ్డారని తెలిపారు. స్కూటీ పార్క్ చేసినప్పుడు నిందితులు ప్లాన్ చేసి ఉంటారన్నారు.

శిక్షలు భయపడేలా ఉండాలి..
నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఇలాంటి నేరాలు కొంత తగ్గాయని.. కానీ, మళ్లీ ఇప్పుడు మామూలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. వీరికి పడే శిక్ష మరొకరికి భయం పుట్టేలా ఉండాలన్నారు.

కేటీఆర్ అలా అనడం సిగ్గుచేటు
పోలీస్ వ్యవస్థ మొత్తం టీఆర్ఎస్ నాయకులకు కొమ్ముకాస్తోందని అన్నారు. ఇక మంత్రి కేటీఆర్ ట్విట్టర్ పిట్గగా మారారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్‌లో మాత్రమే మాట్లాడుతారని అన్నారు. ప్రియాంక కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్వించారు. విపక్ష నేతలను, కార్మికులను అణిచివేయడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటంపై లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లయినా మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదని డీకే అరుణ అన్నారు. ఏ కమిషన్ అయినా కేసీఆరేనని, ఏది ఉన్నా నామమాత్రమేనని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications