ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత: మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డగించి, స్థానికుల ఆగ్రహం
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
శంషాబాద్‌లోని ప్రియాంక నివాసం వద్ద స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసనకారులను తోసేసి మంత్రిని అక్కడ్నుంచి పంపించివేశారు. ఈ క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

తమపై పోలీసులు దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రియాంక నివాసానికి ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండే ఉత్తరభారతీయులు చేరుకున్నారు. నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ప్రియాంక దారుణ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించండి లేదంటే తమకు అప్పగించండి.. తామే శిక్షిస్తామని అన్నారు.
ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించివుంటే ప్రియాంక ప్రాణాలతో ఉండేదని అన్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయండి అని నినాదాలు చేశారు. మంత్రులు నిర్లక్ష్యంగా మాట్లాడటంపైనా స్థానికులు మండిపడ్డారు.
ప్రియాంక తన చెల్లెలికి కాకుండా 100 కాల్ చేయాల్సిందని ఓ మంత్రి అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలనే ఆలోచన ఎలా వస్తుందని మండిపడ్డారు. బుధవారం రాత్రి ప్రియాంకపై నలుగురు లారీ డ్రైవర్, క్లీనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఆ నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చి త్వరితగతిన శిక్షపడేలా చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications