రాహుల్ రాముడు, రేవంత్ హనుమంతుడు.. కేసీఆర్ రావణుడు: ఇదీ టీపీసీసీ చీఫ్ లెక్క
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌ను రావణుడితో పోల్చారు. రాహుల్ గాంధీ రాముడట.. ఆయన హనుమంతుడని పోల్చుకున్నారు. రేవంత్ చేసిన తాజా కామెంట్స్ పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది. ఎటొచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం పక్కా అని రేవంత్ ధీమాతో ఉన్నారు. తన లక్కీ నంబర్ 9 అని.. తమకు 99 సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరారు.

వీ ఆర్ యునైట్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా కలసికట్టుగా పని చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం ఎవరనేది పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయిస్తారని చెప్పారు. సోనియా గాంధీ ఎవరి పేరును ప్రకటిస్తే వారే పదవీ చేపడుతారని పేర్కొన్నారు. తనకు ఇంత గొప్ప పదవి ఇచ్చినందుకు సోనియ గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తనపై ఆమె చూపిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అని తెలిపారు.

రాహుల్ రాముడు
అంతేకాదు రాహుల్ గాంధీ రాముడు అని ప్రశంసించారు. తాను హనుమంతుడినని రేవంత్ చెప్పుకున్నారు. వానరసైన్యం లాంటి కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో రావణుడులాంటి కేసీఆర్‌ను ఓడించేందుకు యుద్ధం చేస్తానని చెప్పారు. హుజూరాబాద్ ఓటమితో తాను కుంగిపోయానని గుర్తుచేశారు. కార్యకర్తలే తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. వారి సహకారం వల్లే తమ పార్టీకి పూర్వవైభవం వస్తోందని తెలియజేశారు.

99 సీట్లు పక్కా
తన లక్కీ నంబర్ 9 అని... అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సునామీలో టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పారు. తమ పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందని.. దాంతోనే తమ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతను చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.












Click it and Unblock the Notifications