Rains: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో వర్షం..
శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొండాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, కూకట్‌పల్లి, దుండిగల్, మల్లంపేట్, గండి మైసమ్మ, సూరారం, గాగిల్లాపూర్ తేలిపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.
తెలంగాణలో పలు జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

అటు ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. శనివారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి శ్రీవారి ఆలయం ఎదుట వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో వర్షం రావడంతో భక్తులు షెడ్ల వైపు పరుగులు తీశారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ప్రోపోస్పిరిక్ స్థాయి వరకు కొనసాగుతుందని వివరించింది.
ఈ నెల 8వ తేదీ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం మరుసటి రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్ర తరమై తుపాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం వల్ల తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వాతావరణ శాఖ హెచ్చరికతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా నష్టపోయిన రైతులు ఇంకా వర్షాలు ఉన్నాయని తెలియడంతో భయపడుతున్నారు. కొన్ని ఐకేపీ కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications