షాకింగ్ : హైదరాబాద్ లో ఆ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ..100 బెడ్లకు చేరింది ముగ్గురే !!
దేశం మొత్తం కరోనామహమ్మారి విజృంభణతో విలవిలలాడుతున్న సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నుండి మహానగరంలో ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని తెలుస్తుంది. అయితే అదే హైదరాబాద్ మహానగరంలో ఓ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 100 బెడ్ లను ఏర్పాటు చేస్తే కేవలం ముగ్గురే చేరిన పరిస్థితి. ఆసుపత్రులు ఖాళీ లేక,బెడ్ల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో హైదరాబాద్లోని ఆ ఆసుపత్రి ఎందుకు ఖాళీగా ఉంది. అక్కడ ఏం జరిగింది? తెలియజేసేందుకే ఈ కథనం.

రామాంతపూర్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో వంద పడకలతో ఐసోలేషన్ కేంద్రం
హైదరాబాద్ లో ఉప్పల్ సర్కిల్లోని రామంతపూర్,ఉప్పల్,హబ్సిగూడ, చిలుకా నగర్ డివిజన్లకు చెందిన ప్రజలు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం తోపాటు బస్తీ దవాఖాన లో నిత్యం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. చాలామంది కోవిడ్ బారిన పడుతుండగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని భావించిన అధికారులు రామంతపూర్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో వంద పడకలతో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు.

కేంద్రంలో సౌకర్యాల లేమి, అపరిశుభ్ర వాతావరణం, ఇప్పటివరకు చేరింది ముగ్గురే
అయితే ఈ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు లేవని బాధితులు అందులో చేరడానికి ఆసక్తి చూపించడం లేదు.ఐసోలేషన్ కేంద్రంలో చేరదామని వచ్చినవారికి అక్కడ అపరిశుభ్ర వాతావరణం,వసతుల లేమి ఇబ్బంది పెడుతోంది. దీంతో వారు నిరాశగా అక్కడి నుండి వెనుదిరుగుతున్నారు.ఇప్పటివరకు ఈ ఐసోలేషన్ కేంద్రంలో కేవలం ముగ్గురే చేరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వంద పడకలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం నిరుపయోగంగా మారడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అపరిశుభ్ర వాతావరణం, వసతుల లేమిపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
కనీసం ఈ ఐసోలేషన్ కేంద్రంలో పల్స్ యాక్సిలేటర్లు ,ఆక్సిజన్ సిలిండర్లు వంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇక్కడ చేరేందుకు ప్రజలు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే ఈ ఐసోలేషన్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అపరిశుభ్ర వాతావరణం, వసతుల లేమిపై అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బాధితులకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.
Recommended Video

కలెక్టర్ ఆదేశించినా మారని పరిస్థితి
అయినప్పటికీ ఇప్పటివరకు అక్కడి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది .అధికారులు చొరవ చూపి ఈ ఐసోలేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించి,వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తే కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన వంద పడకలు బాధితులకు ఉపయుక్తంగా మారుతాయి.లేదంటే నిరుపయోగంగా మిగిలిపోతాయి.












Click it and Unblock the Notifications