గణేశ్ నిమజ్జనం: సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్
వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిమజ్జనానికి సమయం సమీపిస్తోన్న వేళ.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో పీవోపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. సీజేఐ ఎన్వీ రమణ ఆధ్యర్యంలోని ధర్మాసనం కేసు విచారణను చేపట్టనుంది.
ఖైరతాబాద్ మహా గణపతి సహా నగరంలో గల వేలాది విగ్రహాల నిమజ్జనం ఎక్కడా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. నిమజ్జనానికి మరో కొద్దీరోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దనే తీర్పును అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ భారీ గణనాథుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? అక్కడి వరకు ఆ విగ్రహాన్ని ఎలా తరలిస్తారనే అంశం సస్పెన్స్‌గా మారింది. భాగ్యనగరంలో భారీ సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారని, వాటిలో నెలకొల్పిన వేలాది విగ్రహాల నిమజ్జనానికి తగినన్ని నీటి కుంటలు అందుబాటులో లేవని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ సారికి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అనుమతించాలని.. లేకపోతే నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజుల సమయం పడుతుందని తెలిపిన సంగతి తెలిసిందే.
బల్దియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది జీహెచ్‌ఎంసీ. కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో కష్టమవనుంది. అందుకోసమే ఈ సారికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కానీ ససేమిరా అనడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications