మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనావైరస్ పాజిటివ్: తెలంగాణలో కొత్తగా 111, సిటీలో ఎన్నంటే?
హైదరాబాద్: తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారినపడ్డారు. పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెకు ప్రత్యేక ఐసోలేషన్‌లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె ములుగులో పర్యటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ప్రచారంలో సత్యవతితోపాటు రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో వారంతా కొంత ఆందోళనలో ఉన్నారు. పలువురు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిసింది.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ఆదివారం రాత్రి 8గంటల వరకు 19,929 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,011కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఆదివారం కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1642కు చేరింది. కరోనా బారినుంచి ఆదివారం 180 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సుక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,96,562కి చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 27 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 689 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. తెలంగాణ ఇప్పటి వరకు 89,84,552 కరోనా పరీక్షలను నిర్వహించారు.