బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ బహిరంగ లేఖ వెనుక బిగ్ రీజన్స్!!
ఎన్నికల ఏడాది కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాయటం వెనుక మతలబు ఇదే అని రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చాలాకాలం తరువాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆసక్తికరమైన బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా కెసిఆర్ వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తూ వారికి దిశా నిర్దేశం చేశారు. భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు అంటూ ప్రస్తావించిన కేసీఆర్ వారిలో ఫ్యామిలీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సాగిన ప్రస్తానాన్ని లేఖలో ప్రస్తావించారు.
14 సంవత్సరాలలో పార్టీ ఎదుర్కొన్న అనేక కష్టనష్టాలను గుర్తు చేస్తూ కెసిఆర్ రాసిన లేఖలో మీరే నా బలం.. నా బలగం అంటూ గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితి పేరుతో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశవ్యాప్తం అవుతున్నామని పేర్కొన్న కేసీఆర్ తాను చేసే ఈ ప్రయత్నానికి అందరూ కలిసి రావాలని కేంద్రంలో కిసాన్ సర్కార్ స్థాపించే వరకు ఎవరు మడమ తిప్పకూడదని తన లేఖ ద్వారా పేర్కొన్నారు. అయితే కెసిఆర్ ఇప్పుడు లేఖ రాయడంపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు కేసీఆర్ ఇప్పుడు లేఖ రాయడం వెనుక వ్యూహం ఏమిటి అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ తాను రాసిన లేఖ ద్వారా రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఆందోళన చెందకూడదని, ఈ పరిస్థితులన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సృష్టిస్తున్నవే అని, పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ లు దుష్ప్రచారాలు చేస్తున్నారని వాటన్నింటిని తిప్పి కొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక దీంతో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడానికి కేసీఆర్ తన సేనను తాను రాసిన బహిరంగ లేఖ ద్వారా చైతన్యవంతులను చేయాలని, వచ్చే ఎన్నికలకు గిరి గీసుకుని బరిలోకి దిగి బిఆర్ఎస్ సర్కార్ ను గెలిపించడానికి ప్రయత్నం చేయాలి అన్న సంకేతాన్ని ఇచ్చినట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఒకపక్క ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో కవితను ఇబ్బంది పెడుతున్న వేళ కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా, మరొక పక్క రాష్ట్రంలో పేపర్ల లీకేజీ వ్యవహారంతో దుమారం రేగిన వేళ ఎన్నికల సంవత్సరం ఇప్పటి నుండే అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ తన లేఖ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దేశ రాజకీయాలలో తాను బిజీగా ఉంటానని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పి కేసీఆర్ ఈసారి పార్టీని విజయపథం వైపు నడిపించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణుల పైన ఉందని గుర్తు చేశారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తూనే, మరొక బీర్ ఎస్ పార్టీ శ్రేణులను కూడా కార్యోన్ముఖులను చేస్తూ సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ కెసిఆర్ లేఖ రాయడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications