ఇంట్లో పనిచేసే యువకుడి పెళ్లికి హాజరైన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన ఇంట్లో పనిచేసే మహేష్ అనే యువకుడి పెళ్లికి హాజరయ్యారు కవిత. నవ దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. యాదాద్రిలో నిర్మించిన ఆలయం ఈ రోజు మన తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశం మొత్తంతో ఎంతో సగర్వంగా చెప్పుకుంటుందన్నారు కవిత. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఉద్యమంలోనూ ఇటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని, ఇది చాలా సంతోషంగా ఉందన్నారు కవిత.

ఎన్ని పార్టీలు వచ్చి ఇబ్బందులకు గురిచేసినా.. ప్రజలు కేసీఆర్ వైపు నడవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జడ్పీటీసీ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు జిల్లాలో మంచి ఆదరణ పొందిన నేతగా ఎదిగిన సునీత ప్రస్థావనను ఆమె అభినందించారు. యాదాద్రి జిల్లాలో 2001 నుంచి జడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికీ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్న సునీతా రాజకీయ ప్రస్థానం మనందరికీ ఆదర్శమన్నారు.
ఇది ఇలావుండగా, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేంద్రహోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ ప్రతులు ఇవ్వాలని సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చన్నారు. కాగా, శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, ముఖ్య నేతలు, కుటుంబసభ్యులతో సీబీఐ నోటీసులు, రాజకీయ పరిణామాలపై కవిత చర్చించినట్లు తెలిసింది.