తెలంగాణలో జగన్ వదిలిన బాణం: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైయస్ షర్మిల..?
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారా? అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా ఎదగబోతోన్నారా? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పూర్తిగా బలహీన పడిన ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ధీటుగా కొత్త పార్టీని స్థాపించబోతోన్నారా..లేక తన సొంత పార్టీని అక్కడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారా? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా సాగుతోన్న చర్చ ఇది. ప్రత్యేకించి- సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది.

ప్రత్యామ్నాయంగా బీజేపీ..
అవన్నీ దుబ్బాక ఉప ఎన్నిక వరకే. సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ వేసింది. గులాబీ నేతలకు ఖంగు తినిపించింది. ఇప్పట్లో ఎదురు ఉండబోదంటూ భావించిన అధికార పార్టీ నేతల అంచనాలను తలకిందులు చేసింది. దుబ్బాక కోటపై కాషాయ జెండా ఎగిరింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడం వల్ల ఏర్పడిన సానుభూతి పవనాలు, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలను అధిగమించి.. బీజేపీ విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గ్రేటర్‌లోనూ అవే ఫలితాలు..
దుబ్బాకలో ఆరంభమైన బీజేపీ నేతల జైత్రయాత్ర.. అక్కడితోనే ఆగిపోలేదు. గ్రేటర్ హైదరాబాద్ వరకూ విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ.. టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించింది. ఏకంగా 48 డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. టీఆర్ఎస్ 56 డివిజన్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండింటికే పరిమితమైంది. తెలుగుదేశం తన ఖాతాను తెరవలేకపోయింది. వెంటవెంటనే సంభవించిన ఈ పరిణామాలు.. బీజేపీ బలపడుతోన్న సంకేతాలు ఇచ్చింది.

ఇదే సరైన సమయమా?
ఈ పరిణామాల మధ్య.. కొత్త పార్టీని నెలకొల్పడానికి లేదా.. తన పార్టీని తెలంగాణలో విస్తరింపజేయడానికి ఇదే సరైన సమయం అని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనితో- ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల బరిలో దింపే అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం.. ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్‌కు బలమైన ఓటుబ్యాంక్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, బలమైన టీడీపీ, కమ్యూనిస్టులు, చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం వంటి పార్టీలను ఢీ కొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 10 స్థానాలకే పరిమితం కావడం.. వైఎస్ సత్తాను చాటింది. ఇప్పటికీ వైఎస్‌ను అభిమానించే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కూడా.. 2014 ఎన్నికల్లో వైసీపీ ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం దీనికి నిదర్శనం.
Recommended Video

వైసీపీ ఓటుబ్యాంకును ఏకీకృతం చేసేలా..
తెలంగాణలో వైసీపీ ఓటుబ్యాంకు చెల్లాచెదురైంది. వైసీపీ నాయకత్వం.. ఇక్కడి రాజకీయాలపై దృష్టి సారించకపోవడం వల్ల వైసీపీ అభిమానులు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తూ వస్తున్నారు. దీనికి భిన్నంగా- తెలంగాణ రాజకీయాల్లోనూ అడుగు పెట్టగలిగితే.. వైసీపీ ఓటుబ్యాంకును ఏకీకృతం చేసినట్టవుతుందనే అభిప్రాయాలు చాలాకాలం నుంచే వినిపిస్తూ వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ మొదలుకుని.. దక్షిణ ప్రాంత జిల్లాల వరకూ వైసీపీ అనుకూలంగా ఉన్న ఓటర్లను సంఘటితం చేయగలిగితే.. కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు. అందుకే- వైఎస్ షర్మిలను బరిలో దింపుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications