Supreme Court: రూ.2700 క్యాన్సర్ మందు 27 వేలకు..! దోపిడీపై సుప్రీం తీవ్ర ఆగ్రహం..!
దేశంలో ఫార్మా కంపెనీల దోపిడీ వ్యవహారం ఇవాళ మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్మా కంపెనీలు రిటైలర్లకు విక్రయించే మందుల ధరలకు, ప్యాకెట్లపై ముద్రించే గరిష్ట చిల్లర ధర (MRP)కి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ధర కంటే ఏకంగా పది రెట్లు అదనంగా ఎమ్మార్పీ ముద్రించి విక్రయించడం ప్రజలను నిలువునా దోపిడీ చేయడమేనని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం రూ. 2,700లకే లభించే జీవన రక్షక క్యాన్సర్ వంటి ఔషధాలను (Cancer Drug), మార్కెట్లో ఏకంగా రూ. 27వేల ఎమ్మార్పీతో విక్రయించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి సాధారణ ప్రజలు తమ ఇళ్లను, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నారని జస్టిస్ మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఈ అక్రమాలపై మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. కిషన్ చంద్ జైన్, డాక్టర్ సంజయ్ కుల్శ్రేష్ఠ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశంలోని ఔషధ విక్రయ విధానాల లోపాలు వెలుగులోకి వచ్చాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే దాదాపు 82 శాతం నాన్-షెడ్యూల్డ్ మందుల ప్రారంభ ధరలపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ లేదని పిటిషనర్లు సుప్రీం దృష్టికి తెచ్చారు.

దీనివల్ల ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, పెద్ద రిటైల్ దుకాణాలు రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని భారీగా నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని, ఈ దోపిడీని అరికట్టడానికి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కోరారు. ఈ తీవ్రమైన ధరల వ్యత్యాసం కేవలం సామాన్య రోగులకే కాకుండా ప్రభుత్వ ప్రజా ఆరోగ్య పథకాలకు కూడా భారీ నష్టం చేకూరుస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కింద ఆసుపత్రులు పెంచిన ఎమ్మార్పీల ఆధారంగానే నిధుల రీయింబర్స్మెంట్ పొందుతున్నాయని గుర్తుచేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై కూడా పెను భారం పడుతుందని, అంతిమంగా పన్ను చెల్లింపుదారుల సొమ్ము తీవ్రంగా దుర్వినియోగం అవుతోందని తెలిపింది. ఫార్మా తయారీదారులు తాము తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని సమర్థించుకున్నప్పటికీ, అసలు ఆయా మందులపై భారీ ఎమ్మార్పీ ధరను ముద్రించేది వారేనని కోర్టు గుర్తుచేసింది.














Click it and Unblock the Notifications
