అమ్మాయి పుట్టబోతోందని అబార్షన్.. 24 గంటల్లోనే తీవ్ర అపశృతి.. ఏం జరిగిందంటే..?
ఓవైపు మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. ఇతర కారణాలతో ఇటీవలి కాలంలో సంతాన సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంతానం కోసం దంపతులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనూ కొంతమంది ఆడ బిడ్డ.. మగ బిడ్డ అంటూ మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు. తాజాగా ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో సంచలన ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో సంచలన ఘటన వెలుగు చూసింది. సోను కేవత్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం కిరణ్ కుమారి(24) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల ఆమె గర్భం దాల్చింది. ఈ మేరకు భర్త సోను కేవత్.. శ్యామ్ దిహ్ లోని 'సెంట్రల్ డయాగ్నస్టిక్ సెంటర్' లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. అయితే పరీక్షల్లో అమ్మాయి పుట్టబోతుందని తేలింది. ఈ క్రమంలో అబార్షన్ చేయించుకోవాలని కిరణ్ కుమారిపై భర్త, అత్తింటివారు ఒత్తిడి చేశారు. తమ కుటుంబానికి అబ్బాయి కావాలని అమ్మాయి వద్దని కిరణ్ కుమారిని తీవ్రంగా వేధించారు. అయితే భర్త, అత్తింటివారి వేధింపులు తాళలేక కిరణ్ కుమారి అబార్షన్ కు ఒప్పుకుంది.

ఈ క్రమంలో భర్త సోను కేవత్.. కిరణ్ కుమారికి దగ్గరుండి అబార్షన్ చేపించాడు. అయితే వైద్యం వికటించి ఆమె 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక తన కూతురుకి బలవంతంగా అబార్షన్ చేయించి ఆమె మృతికి కారణమయ్యారని మృతురాలి తండ్రి రాజేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్త సోనుతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడు, ఓ సిబ్బంది, ఓ నర్సును కూడా అరెస్ట్ చేశారు అధికారులు. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications
