కొత్త రంగంలో అడుగు పెట్టిన గౌతమ్ అదాని
Adani: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సంస్థలు.. విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్రోకెమికల్స్ రంగంలోకి అడుగు పెట్టాయి. ఇందులో భాగంగా థాయ్‌లాండ్‌కు చెందిన ఇండోరమ రిసోర్సెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.
అదాని గ్రూప్‌కు చెందిన అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఈ మేరకు ఇండోరమ రిసోర్సెస్‌తో జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించింది. ఇండోరమ రిసోర్సెస్ జాయింట్ వెంచర్ కంపెనీ వాలర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో విలీన ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారాన్ని ఇచ్చింది.

ఈ జాయింట్ వెంచర్‌లో అదానీ పెట్రోకెమికల్స్- ఇండోరమ మొత్తం 50 శాతం వాటాలను కలిగి ఉంటాయి. రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ రంగంలో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీర్ఘకాలంలో రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్ యూనిట్లు, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
గుజరాత్‌లో కొత్త పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గౌతమ్ అదానీ 2022లోనే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా రెండు మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో పాలీ వినైల్ క్లోరైడ్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు.
2026 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేసుకోనుందీ ప్లాంట్. ఆ మరుసటి ఏడాది నాటికి అంటే- 2027కు ఉత్పత్తి మొదలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి- అదానీ గ్రూప్ ఆర్థిక మోసానికి పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పీవీసీ ప్లాంట్ నిర్మాణంలో కొంత జాప్యం ఏర్పడింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది.
పీవీసీ ప్లాంట్‌తో పాటు, అదానీ పెట్రోకెమికల్స్ సంస్థ.. గుజరాత్‌లోని ముంద్రాలో పెట్రోకెమికల్ హబ్‌ను సైతం నిర్మిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ పెట్టుబడి అంచనా దాదాపు 35,000 కోట్ల రూపాయలు. ఇది పూర్తయిన తరువాత దేశంలో అతిపెద్ద పీవీసీ తయారీ యూనిట్‌గా ఆవిర్భవిస్తుంది. అలాగే- అదానీ గ్రూప్ జర్మన్ కెమికల్ దిగ్గజం బీఏఎస్ఎఫ్‌తో కలిసి ముంద్రాలో కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించింది. ఈ భాగస్వామ్యం గురించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications