Delhi Polls: ఢిల్లీలోకి విషపు యమునా నీరు-హర్యానాపై ఈసీకి అతిషి ఫిర్యాదు..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ మధ్యతరగతి ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించి జనంలోకి వెళ్లి రాజకీయాలు చేసుకున్న అధికార ఆప్, విపక్ష బీజేపీ ఇప్పుడు మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టాయి. ఢిల్లీలోకి పొరుగున్న బీజేపీ పాలిత రాష్ట్ర హర్యానా విషపు నీటిని వదులుతోందని ఆప్ అధినేత కేజ్రివాల్ నిన్న ఆరోపించగా.. ఇవాళ సీఎం అతిషి మరో అడుగు వేశారు.
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రసాయనాలతో కూడిన యమునా నది నీటిని ఢిల్లీలోకి వదులుతోందని సీఎం అతిషి ఆరోపించారు. యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఆరు రెట్లు ఎక్కువగా ఉందని, మనుషుల శరీరాలకు ఇది అత్యంత ప్రమాదకరమని అతిషి తెలిపారు. ఇలాంటి నీటిని శుద్ధి చేయడం సాధ్యం కాదని, ఢిల్లీ ప్రజలకు ఇవ్వలేమని ఆమె తేల్చిచెప్పేశారు. అలాగని నీటిని ఇవ్వకపోతే వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని తెలిపారు. ఈ మేరకు ఈసీ జోక్యం చేసుకోవాలని ఆమె ఓ లేఖలో కోరారు.

నిన్న కేజ్రివాల్ ఇదే అంశంపై ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి నీటిని ఢిల్లీ ప్రజలు తాగితే చాలా మంది చనిపోతారన్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు. అందుకే ఢిల్లీలో చాలా చోట్ల నీటి సరఫరా ఆపాల్సిన పరిస్ధితి ఎదురవుతోందన్నారు. బీజేపీ సామూహిక మానవ హననానికి ప్రయత్నిస్తోందని, ఆప్ దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ జరగనివ్వబోదని కేజ్రివాల్ హెచ్చరించారు. అయితే కేజ్రివాల్ వాదనను ఢిల్లీ జల్ బోర్డు సీఈవో శిల్పా షిండే తప్పుబట్టారు. కేజ్రివాల్ వ్యాఖ్యలు జనాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అంతర్ రాష్ట్ర వివాదాలు తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications