21 మంది AIADMK రెబెల్స్ పై అనర్హత వేటు- స్పీకర్ కీలక నిర్ణయం..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల్లో ఇవాళ మరో బిగ్ టర్న్ ఎదురైంది. ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష అన్నాడీఎంకే (AIADMK)కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకేకు మద్దతుగా నిలిచారు. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామిని ధిక్కరించి వీరంతా విజయ్ కు బలపరీక్షలో ఓటేశారు. దీంతో వీరిపై అనర్హత వేటు కోరుతూ పళనిస్వామి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ ను తోసిపుచ్చారు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామికి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. మే 13న జరిగిన కీలకమైన బలపరీక్షలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు అనుకూలంగా ఓటు వేసిన 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పళనిస్వామి అభ్యర్థనను స్పీకర్ తోసిపుచ్చినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది.

రెబెల్ నాయకులు షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ సారథ్యంలోని టీవీకేకు మద్దతు తెలిపారు. దీంతో అసెంబ్లీలో 119గా ఉన్న టీవీకే బలం 144కు చేరింది. అలాగే విజయ్ బలపరీక్షను సునాయాసంగా నెగ్గారు. మరోవైపు పళనిస్వామికి విధేయులుగా మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం పార్టీలో చీలికను బయటపెట్టంది. ఈ పరిణామం పళనిస్వామి పట్టును గణనీయంగా తగ్గించింది. అయితే, రెబల్ క్యాంప్‌లోని ఐదుగురు సభ్యులు అనూహ్యంగా తిరిగి పళనిస్వామి గూటికి చేరడంతో, ఆయనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 27కు పెరిగింది.

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, మరొక పార్టీలో విలీనం కావాలంటే శాసనసభా పక్ష సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అన్నాడీఎంకే విషయంలో ఈ సంఖ్య 31గా ఉంది. రెబల్ ఎమ్మెల్యేలకు ఈ మేర బలం లేకపోవడంతో, వారు అధికారికంగా విలీనాన్ని పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా, టీవీకేకు ఓటు వేసిన 25 మంది ఎమ్మెల్యేలలో నలుగురు, కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ఆ పార్టీలో చేరడం విశేషం. స్పీకర్ నిర్ణయం రెబల్ ఎమ్మెల్యేలకు తక్షణ ఊరటనిచ్చినప్పటికీ, అన్నాడీఎంకేలో పళనిస్వామి నాయకత్వంపై ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. పార్టీ భవిష్యత్తుపై రెబల్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ, నిరంతర ఫిరాయింపులు, అధికార పార్టీకి పెరుగుతున్న మద్దతు అన్నాడీఎంకేలో అనిశ్చితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications