80 జడ్డీల నియామకాలు తొక్కిపెట్టిన కేంద్రం ? సుప్రీం సీరియస్- మళ్లీ రచ్చ..
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులు గత 10 నెలలుగా 80 మంది జడ్డీల బదిలీలు, నియామకాల కోసం కొలీజియంకు పంపిన సిఫార్సుల్ని కేంద్రం తొక్కిపెట్టడంపై ఇవాళ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుల సిఫార్సుల్ని కొలీజియంకు పంపకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ కేంద్రంపై సుప్రీం మండిపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టులు సిఫార్సు చేసిన జడ్జీల పేర్లను కొలీజియంకు పంపకుండా కేంద్రం జాప్యం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్ధానం వెల్లడించింది. హైకోర్టు నుండి 80 మంది పేర్లు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఇందులో కేవలం ప్రాథమిక ప్రక్రియ మాత్రమే జరిగింది. కొలీజియం నిర్ణయం తీసుకునేలా మీ అభిప్రాయం తెలుసుకోవాలంటూ జస్టిస్ కౌల్ కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు.

ఇందులో 26 మంది న్యాయమూర్తుల బదిలీలు, ఓ సున్నితమైన హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నియామకం పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు సిఫార్సు చేసిన తర్వాత కొలీజియంకు అందని పేర్లు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తమ వద్ద సమాచారం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌల్ తెలిపారు. దీనిపై స్పందించేందుకు అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి వారం గడువు కోరారు. దీంతో బెంచ్ ఆయనకు రెండు వారాల సమయం ఇచ్చింది. అలాగే కేంద్రం వాదనతో తిరిగి రావాలని కోరింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 9కు వాయిదా వేసింది.
ఈ కేసు విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌల్.. తాను చెప్పాల్సింది చాలా ఉందని, కానీ తానే ఆపేస్తున్నానని అసహనం వ్యక్తం చేశారు. ఏజీ ప్రతిస్పందించడానికి ఒక వారం గడువు కోరినందున తాను మౌనంగా ఉన్నానని, కానీ తదుపరి విచారణలో మాత్రం తాను నిశ్శబ్దంగా ఉండనని తెలిపారు. న్యాయమూర్తుల నియామకం అనేది సుప్రీంకోర్టు , కార్యనిర్వాహక వ్యవస్ధల మధ్య వివాదంలో కీలకమైన అంశంగా మారింది. న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వ పాత్ర ఉండాలని కేంద్ర మంత్రులు వాదిస్తున్నారు. కానీ న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్రానికి హక్కు కల్పించే జాతీయ న్యాయ నియామకాల చట్టాన్ని అక్టోబర్ 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.












Click it and Unblock the Notifications