పండగల వేళ కేంద్రం మరో గుడ్ న్యూస్-తగ్గిన వంట నూనెల ధరలు-ఎంతెంతో తెలుసా ?
దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో జనానికి కేంద్రం వరుస కానుకలిస్తోంది. ఇప్పటికే దీపావళి కానుక పేరుతో చమురు ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు వంటనూనెల ధరలపైనా పన్నులు తగ్గిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీంతో వంటనూనెల ఉత్పత్తి కంపెనీలు కూడా ఇప్పుడు నూనెల ధరల తగ్గింపు బాట పట్టాయి. ఈ మేరకు పండుగల సీజన్లో వినియోగదారులకు భారీ ఊరట లభిస్తోంది. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

కేంద్రం దీపావళి కానుకలు
దేశ ప్రజల ఇళ్లలో దీపావళి కాంతులు నింపేందుకు కేంద్రం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలకు వరుసగా ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయాలు ఉంటున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ధరాఘాతంతో పాటు కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నిర్ణయాలు ఎంతో ఊరటనిచ్చేలా ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ రాజకీయ అవసరాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నా అంతిమంగా వినియోగదారులకు మాత్రం వీటితో భారీ ప్రయోజనం చేకూరబోతోంది.

పెట్రో ధరల తగ్గింపు
తాజాగా దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్ తో పాటు అన్ని చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రాల్ని సైతం వ్యాట్ తగ్గించాలని కోరడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఈ మేరకు భారీ తగ్గింపులు ప్రకటించాయి. దీంతో దీపావళి డబుల్ ధమాకా రూపంలో ఈ ఊరట ప్రజలకు చేరుతోంది. దీంతో పండుగ సీజన్లో తగ్గిన ధరలు సామాన్యులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల సంగతి పక్కనబెడితే వినియోగదారుల కోణంలో మాత్రం కేంద్రం నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతోంది.

వంటనూనెల ధరలూ తగ్గింపు
పెట్రో ధరల తగ్గింపుతో ఊరటపొందుతున్న వినియోగదారులకు ఇప్పుడు కేంద్రం దీపావళి కానుకగా మరో ఊరట కూడా ఇచ్చింది. ఈసారి వంటనూనెల ధరల్ని సైతం తగ్గించే చర్యను ప్రకటించింది. వంటనూనెలపై విధిస్తున్న మూలపన్నులో కోత విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వంటనూనెలపై విధిస్తున్న బేసిక్ డ్యూటీని 2.5 శాతం నుంచి సున్నాకు తగ్గించేసింది. ఈ నూనెలపై అగ్రి సెస్‌ను క్రూడ్ పామాయిల్‌పై 20 శాతం నుంచి 7.5 శాతానికి, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5 శాతానికి తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో వంటనూనెల ఉత్పత్తి కంపెనీలైన ఆదానీ విల్మార్, రుచీ ఇండస్ట్రీస్ తో పాటు పలు కంపెనీలు తాము ఉత్పత్తి చేస్తున్న వంటనూనెల ధరలు తగ్గించాయి. దీంతో పండుగ సీజన్లో పిండి వంటలు చేసుకునేందుకు సామాన్యులకు ఊరట దక్కినట్లయింది.

వంటనూనెలు ఎంత తగ్గాయంటే
కేంద్రం బేసిక్ డ్యూటీలో తగ్గింపు ప్రకటించిన వెంటనే దేశంలోని వంటనూనెల ఉత్పత్తి సంస్ధలు ఒక్కొక్కటిగా తమ ధరల్ని తగ్గిస్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధాన ఉత్పత్తి దారులైన అదానీ విల్మార్, రుచీ ఇండస్ట్రీస్ తమ వంటనూనెల హోల్ సేల్ ధరల్ని రూ.4 నుంచి రూ.7 రూపాయల వరకూ తగ్గించాయి. జెమినీ ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ అండ్ సాల్వెంట్, విజయ్ సోల్వెక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ మరియు ఎన్‌కె ప్రొటీన్స్ ఎడిబుల్ ఆయిల్స్ హోల్‌సేల్ ధరలను తగ్గించిన ఇతర సంస్ధలు. అంతర్జాతీయంగా నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కేంద్రం జోక్యం చేసుకోవడంతో ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట
కేంద్రం వంటనూనెలపై బేసిక్ డ్యూటీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట కానుంది. ఎందుకంటే దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వంటనూనెల వినియోగంలో తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటుంది. అదీ దీపావళి వంటి పండుగల సందర్భంగా ఇక్కడి ప్రజలు ఎక్కువగా పిండివంటలు తయారుచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సహజంగానే వంటనూనెల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్లో వంటనూనెల వినియోగదారులకు భారీ ఊరట లభిస్తోంది. ముఖ్యంగా పామోలిన్, రిపైన్డ్ సోయాబీన్, రిఫైన్స్ సన్ ఫ్లవర్ ఆయిల్స్ పై కేంద్రం తగ్గించిన పన్ను ప్రయోజనం తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కనిపించబోతోంది.












Click it and Unblock the Notifications