• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌ లో కరెంటు కోతలు లేవా? బీబీసీ రియాలిటీ చెక్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆంధ్రప్రదేశ్‌ లో విద్యుత్ కోతల అంశంపై బీబీసీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది

బొగ్గు కొరత కారణంగా థర్మల్ పవర్ ప్రొడక్షన్ పడిపోయింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏపీలో కరెంటు కోతలపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది.

విద్యుత్ సంక్షోభం రాకుండా ప్రయత్నాలు చేస్తున్నామని, కోతలు లేవని ప్రభుత్వం చెబుతోంది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి కోతలు లేకుండా సరఫరా చేస్తున్నట్టు ప్రకటించింది. అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని అంటోంది.

కానీ, రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారంగా మారుతోందని, ప్రభుత్వ వైఫల్యం వల్లనే విద్యుత్ సమస్య ఏర్పడిందని విపక్షాలు అంటున్నాయి. తమ పార్టీ పాలనలో అయిదేళ్ల పాటు విద్యుత్ కోత అనేదే లేదని, జగన్ పాలనలో రెండేళ్లకే సమస్య వచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది.

ఇంతకీ ఏపీలో విద్యుత్ సరఫరా ఎలా సాగుతోంది? ఇది తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో మూడు ప్రాంతాలలో పరిశీలన జరిపింది.

అక్టోబర్ 18వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం వరకూ అంటే 24 గంటలపాటు విద్యుత్ సరఫరాని గమనించింది. అదే సమయంలో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ విద్యుత్ పంపిణీ గురించి కూడా వివరాలు సేకరించింది. ఆయా రంగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఇదీ...

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో...

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో మూడు సంస్థల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. అందులో అయిదు జిల్లాలకు ఏపీఈపీడీసీఎల్ నుంచి విద్యుత్ అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు ఈ కంపెనీ పరిధిలో ఉన్నాయి.

ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు విద్యుత్ అందుతోంది.

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా గురించి బీబీసీ వివరాలు సేకరించింది. అక్టోబర్ 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు విద్యుత్ పంపిణీ పరిశీలించింది.

ఈ సమయంలో 15 నిమిషాల పాటు విద్యుత్ సరఫరాలో ఆటంకం వచ్చింది. రెండుసార్లు అయిదారు నిమిషాల చొప్పున కరెంటు కోత విధించారు.

18వ తేదీ సాయంత్రం 7గం.ల సమయంలో ఓసారి, 19వ తేదీ ఉదయం 6.30 గం.ల ప్రాంతంలో మరోసారి విద్యుత్ ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పునరుద్దరణ జరిగింది.

''కరెంటు కోత సమస్య లేదు. పది రోజుల కిందట కొంత ఇబ్బంది అనిపించింది. కానీ, ఇప్పుడు పవర్ కట్స్ లేవు. అంతా బాగానే ఉంది'' అని పెదబొడ్డేపల్లికి చెందిన లెక్చరర్ కె.మణి బీబీసీకి తెలిపారు.

విద్యుత్ కోతలు మొదలైతే వ్యవసాయ రంగంలోనే ముందు మొదలవుతాయి.

సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా..

ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న ప్రకాశం జిల్లా పొన్నలూరు కేంద్రంలో విద్యుత్ పంపిణీ గురించి బీబీసీ ఆరా తీసింది.

కొండెపి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గడిచిన వారం రోజులుగా పలుచోట్ల విద్యుత్ కోతలు అమలయ్యాయి. రెండు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు వివిధ కారణాలతో నిలిచిపోయింది. అయితే ట్రాన్స్‌ఫార్మర్ లోపాల వల్లే ఇలా జరిగిందని స్థానిక అధికారులు బీబీసీకి తెలిపారు.

''ట్రాన్స్‌ఫార్మర్ లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అది సరిచేయడానికి సమయం పట్టింది. రెండు, మూడు రోజుల పాటు కరెంటు కోతలు కాకపోయినా సరఫరాలో రెండు మూడు గంటల చొప్పున ఆటంకం ఏర్పడింది. అధికారికంగా ఎటువంటి కరెంటు కోతలు లేవు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ తెచ్చాం. ఎటువంటి ఇబ్బంది రాదు" అని కందుకూరు డీఈ కె.వెంకటేశ్వర రావు బీబీసీతో అన్నారు.

పొన్నలూరులో మాత్రం ఆగష్టు 18 నుంచి 19 వరకూ పవర్ కట్స్ లేకుండా విద్యుత్ సరఫరా జరిగింది.

''దసరాకి ముందు కొద్దిసేపు కోత విధించేవారు. మండల కేంద్రంలో కన్నా గ్రామాల్లో కరెంటు తీసేసే వారు. కానీ ఇప్పుడు వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో ఆటంకం లేదు'' అని పొన్నలూరుకు చెందిన మండవ మాధవ్ బీబీసీకి తెలిపారు.

రాయలసీమలో మాత్రం..

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నిట్టూరులో విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడింది. సుమారు 2 గం.ల పాటు కోత అమలు చేశారు. సాయంత్రం 6 గం.ల తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటన్నర పాటు కరెంటు రాలేదు.

''మంగళవారం ఉదయం కూడా కొంతసేపు కరెంటు కోత అమలు చేశారు. ఉదయం పూట కరెంటు పోయినా, వెంటనే రావడంతో పెద్ద సమస్య రాలేదు. కానీ రాత్రి కరెంటు పోవడంతో ఇబ్బందిగా ఉంది'' అని నిట్టూరు గ్రామస్తుడు ఎల్లిన చెన్నకేశవ బీబీసీతో అన్నారు.

అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఎల్.ఆర్( లోడ్ రిలీఫ్) అమలులో లేదని అనంతపురం జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ పి.నాగరాజు బీబీసీకి తెలిపారు.

నిట్టూరు వంటి గ్రామాల్లో అక్కడక్కడా తలెత్తే స్థానిక సమస్యలతో కొద్ది సమయం సరఫరాలో ఆటంకం వచ్చి ఉంటుందే తప్ప కరెంటు కోతలు అమలు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.

సమాచారం ఇవ్వకుండా కోతల వల్ల ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

వివిధ రంగాలకు ఎలా ఉంది..

అవసరమైన విద్యుత్ అందుబాటులో లేకపోతే ముందు వ్యవసాయ రంగానికి విద్యుత్ కోత విధించడం చాలాకాలంగా అధికారులు అనుసరించే పద్ధతి. ఇప్పుడు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో సమస్యలు వస్తున్నట్టు బీబీసీ పరిశీలనలో తేలింది.

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రాపాకలో కె. త్రిలక్ష్మి అనే మహిళా రైతు తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.

''వారానికి ఒకసారి లైన్ మారుస్తారు. ఒకవారం ఉదయం 5గం.ల నుంచి 2గం.ల వరకూ కరెంటు వస్తుంది. రెండోవారం ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 6గం.ల వరకూ ఇస్తారు. కానీ ఇప్పుడు కరెంటు 9గంటలు రావడం లేదు. మధ్యమధ్యలో రెండు మూడుసార్లు ఆగిపోతోంది. ఇంతకు ముందు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేది. నెల రోజులుగా కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. గతంతో పోలిస్తే పూర్తిస్థాయి కరెంటు సరఫరా జరగడం లేదు'' అని ఆమె బీబీసీతో అన్నారు.

ఆక్వా కి కరెంటు అందుతోంది..

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కి చెందిన వెంకటేశ్వర రాజు అయిదెకరాలలో ఆక్వా సాగు చేస్తున్నారు. ఆయన స్థానికంగా బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.

''కరెంటు సమస్య లేదు. దసరాకి ముందు మధ్య మధ్యలో కట్ అయిపోయేది. ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సమస్యలు లేవు. విద్యుత్ బాగానే వస్తోంది. ఒకవేళ విద్యుత్ కోతలు విధించే ఆలోచన ఉంటే ముందుగా తెలియజేయాలి. జనరేటర్లు వంటివి సిద్ధం చేసుకుంటాం. లేదంటే పంట నష్టపోతాం. ప్రభుత్వం కరెంటు సరఫరాలో ఆటంకాలు లేకుండా చేస్తే మంచిది'' అని ఆయన బీబీసీతో అన్నారు.

పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఎంతో అవసరం

ఆటోనగర్లో కూడా విద్యుత్ కోతలు తగ్గాయి..

''అక్టోబర్ 10కి ముందు ఒక్కసారిగా కరెంటు కోతలు ఇబ్బంది పెట్టాయి. ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. మాది ఇండస్ట్రియల్ కరెంటు. యూనిట్ ఛార్జ్ ఎక్కువ. కానీ సరఫరా మాత్రం సరిగా ఉండేది కాదు. మాలాంటి చిన్న చిన్న యూనిట్లు చాలా ఇబ్బంది పడ్డాయి. కానీ ఇప్పుడు కోతలు తగ్గాయి. బాగానే ఇస్తున్నారు'' అంటూ విజయవాడ ఆటోనగర్ లో శ్రీ గణేష్ మెకానికల్ యూనిట్ అధినేత పి.సాయిచంద్ తన అనుభవాన్ని వెల్లడించారు.

బొగ్గు కొరత గురించి వార్తల్లో వింటున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే చిన్న కంపెనీలకు చిక్కులు వస్తాయని, కోతలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సాయిచంద్ అన్నారు.

నగరంలోని తమ ఇంట్లో కూడా ఈ మధ్య కాలంలో కరెంటు కోతలు లేవని ఆయన బీబీసీకి తెలిపారు.

పెరిగిన ఉత్పత్తి

ఏపీలో బొగ్గు కొరత కారణంగా వీటీపీఎస్, ఆర్టీపీఎస్ వంటి ప్లాంట్లలో కొన్ని యూనిట్లు ఉత్పత్తి నిలిపివేయడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. అయితే దానిని అధిగమించేందుకు సీఎం కేంద్రానికి లేఖ రాశారు.

బొగ్గు కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా తెలిపింది.

వివిధ ప్రయత్నాల ద్వారా ఏపీలో థర్మల్ పవర్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. ప్రస్తుతం వీటీపీఎస్ లో ఒక్క యూనిట్, ఆర్టీపీఎస్ లో రెండు యూనిట్లు మినహా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది.

అక్టోబర్ 10న ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో మొత్తం 75.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. అందులో థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి 38 మిలియన్ యూనిట్ల విద్యుత్ వచ్చింది.

అక్టోబర్ 17 నాటికి అది 94.73 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అందులో థర్మల్ పవర్ 47.097 యూనిట్లు కూడా పెరగడంతో ఆటంకం లేకుడా విద్యుత్ సరఫరా చేసేందుకు కొంత వెసులుబాటు కలిగింది.

మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా రావడంతో ఉపయోగకరంగా మారింది. కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌ను కూడా కలుపుకుంటే సుమారు 60 మిలియన్ యూనిట్లకు పైగా థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.

పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ కూడా అందుబాటులోకి రావడం ట్రాన్స్ కో అధికారులకు ఊపిరి పీల్చుకునే అవకాశం కలుగుతోంది.

ఇక 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టాలని తాజాగా సీఎం ఆదేశించారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.

ఆయా ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలివ్వడంతో హైడల్ పవర్ ఉత్పాదన కూడా పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఓవైపు గడిచిన పది రోజుల్లోనే విద్యుత్ ఉత్పత్తి కొంత మేరకు పెరగ్గా, అదే సమయంలో అల్పపీడనం సహా వివిధ కారణాలతో విద్యుత్ డిమాండ్ కూడా కొంత తగ్గడం కరెంటు కోతల నివారణకు తోడ్పడినట్టు అధికారులు భావిస్తున్నారు.

సమస్యని సకాలంలో గుర్తించడం వల్లనే...

''రాష్ట్రంలో ప్రస్తుతానికి విద్యుత్ సమస్యను అధిగమించడంలో ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సీఎం సకాలంలో కేంద్రానికి లేఖ రాయడం, బొగ్గు ర్యాక్స్ రావడం, ఇతర మార్గాల్లో అవసరమైన విద్యుత్ కొనుగోలు జరగడంతో కరెంటు కోతల అవసరం రావడం లేదు'' అని ఏపీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ చీఫ్‌ ఇంజనీర్ జె.దేవానంద్ అన్నారు.

ప్రజలు కూడా సహకరించాలని, పీక్ సమయంలో వృథా తగ్గించాలని దేవానంద్ సూచించారు.

విద్యుత్ సంక్షోభం నుంచి ప్రస్తుతం దక్కుతున్నది తాత్కాలిక ఉపశమనమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Are there any power cuts in Andhra Pradesh? BBC reality check
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X