IND vs PAK: తొలగిన ఆ అడ్డంకి: టాస్ పడటమే ఆలస్యం
కొలంబో: ఎప్పుడెప్పుడా అంటూ ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చింది. భారత్- పాకిస్తాన్ బిగ్ ఫైట్ ఇంకాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. రెండు దేశాల క్రికెట్ అభిమానులకు ఇదొక హైఓల్టేజ్ మ్యాచ్. మ్యాచ్‌కు మించి.. అనే రేంజ్‌లో ఈ రెండు దేశాల ప్రజలు భావిస్తుంటారు.
ఆసియా కప్ 2023లో భాగంగా గ్రూప్ ఏలో భారత్- పాకిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుందీ గేమ్. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోణీ మ్యాచ్‌లోనే తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొనబోతోంది.

రోహిత్ సేనపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టోర్నమెంట్ మొత్తం జైత్రయాత్ర సాగించడానికి బోణీ కొట్టినట్టవుతుంది. శుభారంభం చేసినట్టవుతుంది. ఇదే ఊపుతో ఆ తరువాత జరిగే మ్యాచ్‌లల్లో ప్రత్యర్థులను ఓడించడానికి అవసరమైన ఆత్మస్థైర్యాన్ని సాధించుకున్నట్టవుతుంది.
పాకిస్తాన్‌కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొట్టిన విషయం తెలిసిందే. పసికూన నేపాల్‌ను ఏకంగా 238 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ముల్తాన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్.. 23.4 ఓవర్లల్లో 104 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది బాబర్ సేన. గ్రూప్ బీలో శ్రీలంక టాప్‌లో ఉంది.
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠత చివరి వరకూ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలించకపోవచ్చంటూ వార్తలొచ్చాయి. పల్లెకెలెలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా మ్యాచ్ రద్దువుతుందనే అభిప్రాయాలు, అంచనాలు వెలువడ్డాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వరుణుడి అడ్డు తొలగింది. ప్రస్తుతం పల్లెకెలెలో వర్షం పడట్లేదు. వాతావరణం పొడిగా ఉంది. ఆకాశం నిర్మలంగా కనిపిస్తోంది. సాయంత్రానికి ఆకాశం కొంతమేర మేఘావృతం అవుతుందని శ్రీలంక వాతావరణ కేంద్రం అంచనా వేసింది గానీ వర్షం పడే అవకాశాలు పెద్దగా లేవని పేర్కొంది.
మధ్యాహ్నం 3 గంటలకు 58 శాతం, సాయంత్రం 5 గంటలకు 34 శాతం, 7 గంటలకు 60 శాతం, రాత్రి 9 గంటలకు 60 శాతం వరకు మాత్రమే వర్షం పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణకేంద్రం పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఇక భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇక రసవత్తరంగా మారడం, పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications