ఛత్తీస్‌ఘడ్‌లో మావోల కాల్పులు-ఐదుగురు జవాన్ల మృతి- ముగ్గురు నక్సల్స్ మృతి
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఏరివేత కోసం సాగుతున్న కూంబింగ్‌లో ఇవాళ భారీగా జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బీజపూర్ జిల్లా సిలెగార్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. ముగ్గురు నక్సలైట్లు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్ జిల్లాలో ఉన్న సిలెగార్ అడవుల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారంతో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తారెం ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లు ఎదురుపడటంతో పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇరువర్గాలకూ భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఐదుగురు జవాన్లు ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉంది.

బీజపూర్ జిల్లాలోని అడవుల్లో ప్రస్తుతం దాదాపు 400 మంది జవాన్లు కూంబింగ్‌లో పాల్గొంటున్నారు. నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఎస్టీఎఫ్, డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు గాలింపులో నిమగ్నమయ్యాయి. ఇందులో ఇవాళ జరిగిన కాల్పుల్లో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.