స్వాతిని హత్య చేశానిలా: పోలీసులకు రామ్‌కుమార్, ‘నిర్ధోషిగా నిరూపిస్తాం’

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. స్వాతిని హత్య చేసింది తానేనని రామ్‌కుమార్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్‌కుమార్ ఆ హత్య చేయలేదంటూ అతని తరపు న్యాయవాది, అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాగా, మరోసారి రామ్‌కుమార్ తాను స్వాతిని ఏ విధంగా హత్య చేసింది వివరించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో స్వాతిని తాను ఎలా హతమార్చిందీ, ఏ మార్గంలో పారిపోయింది తదితర వివరాలను తెలియజేసేలా రామ్‌కుమార్‌ ఆ రైల్వేస్టేషన్‌లో నటించి చూపాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటిదాకా ఈ విషయం వెల్లడించలేదని, రామ్‌కుమార్‌ను కస్టడీకి తీసుకున్న జులై 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌కు అతడిని తీసుకెళ్లామని తెలిపారు.

స్వాతిని హత్య చేయడానికి రామ్‌కుమార్‌ ఏ మార్గంలో వచ్చిందీ, ఎంత దూరం నుంచి స్వాతిపై కత్తితో దాడి జరిపిందీ, హత్య తర్వాత వేటకొడవలితో ఎంత దూరం వరకు పరుగెత్తిందీ, ఏ చోట ఆ కొడవలిని పారవేసిందీ, రైల్వేస్టేషన్ నుంచి ఏ చోట గోడదాటి దూకి పారిపోయిందీ అనే వివరాలన్నీ తెలిసేలా పోలీసులు ఎదుట నటించి చూపాడట. నుంగంబాక్కం రైల్వేస్టేషన్ వద్ద రామ్‌కుమార్‌ హత్యను చేసిన తీరును నటించినప్పుడు ఆ దృశ్యాలను కూడా వీడియో తీసినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: ఎందుకు చేశావ్: నిందితుడితో ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి, కోర్టుకు రామ్

At station, Ramkumar gives murder recap

కాగా, ఆ వీడియోను కోర్టులో సమర్పించనున్నారు. ఇక స్వాతిని హత్యను చేసి నిందితుడు పారిపోతున్న దృశ్యాలు రైల్వేస్టేషన్ సమీపంలోని మిద్దె ఇళ్లలోని మూడు సీసీటీవీ కెమెరాలలో నమోదయ్యాయని, ఆ వీడియో దృశ్యాలు, ప్రస్తుతం నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో రామ్‌కుమార్‌ పారిపోయేలా నటించిన తీరు సైతం ఒకే విధంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రామ్‌కుమార్‌ హంతకుడని చెప్పటానికి తమ వద్ద సమగ్రమైన ఆధారాలున్నాయని, కోర్టులో సునాయాసంగా నేరాన్ని రుజువు పరచగలమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

హత్యను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు, చూళైమేడులో రామ్‌కుమార్‌ బసచేసిన మేన్షన్ నిర్వాహకులు తదితరులు అందించిన వివరాలన్నీ నేరారోపణకు బలం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పారు. స్వాతిని హత్య చేయడానికి రామ్‌కుమార్‌ ఉపయోగించిన వేటకొడవలి, స్వాతి రక్తపు మరకలు కలిగిన అతడి షర్టు తదితర ఆధారాలన్నీ నేరాన్ని రుజువుచేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌కుమార్‌ హత్యకేసుకు సంబంధించిన ఛార్జీషీటును రూపొందిస్తున్నామని, ఈ నెలాఖరుకల్లా కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కేసును రెండు నెలలోగా ముగించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

నిర్ధోషి అని నిరూపిస్తాం: రామ్ కుమార్ తల్లిదండ్రులు

ఇది ఇలా ఉండగా స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌ జ్యుడీషియల్‌ కస్టడీ సోమవారం ముగియనుంది. దీంతో పోలీసులు అతడిని ఎగ్మూరు కోర్టులో హాజరుపరచనున్నారు. స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో గత జూన్ 24న స్వాతి దారుణహత్యకు గురికావటం, వారం రోజుల తర్వాత సెంగోటై సమీపంలోని మీనాక్షిపురం వద్ద రామ్‌కుమార్‌ను చెన్నై మహానగర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవలే పుళల్‌ జైలులో జరిగిన దోషి నిర్ధారణ పరీక్షలో రామ్‌కుమార్‌ పాల్గొన్నాడు. స్వాతి తండ్రి సంతానగోపాలకృష్ణన్, నుంగంబాక్కం రైల్వేస్టేషన్ బడ్డీకొట్టు యజమాని తదితరులు రామ్‌కుమార్‌ను నిర్ధారించారు. ఆ తర్వాత జులై 13న పోలీసులు అతడిని మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు.

Also Read: స్వాతి హత్య: రామ్ కుమార్‌ను ఇరికించారా, లేదే?

ప్రస్తుతం స్వాతి హత్య కేసు విచారణపై అటు రాజకీయ పార్టీల నాయకులు, ఇటు రామ్‌కుమార్‌ తల్లిదండ్రులు, అతడి తరఫు న్యాయవాదులమంటూ ప్రకటించుకుంటున్న కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ నిర్దోషి అని నిరూపిస్తామని కుటుంబీకులు చెబుతున్నారు.

తగ్గిన గాయం: జైల్లో కౌన్సెలింగ్‌

పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న రామ్‌కుమార్‌ గొంతుమీది గాయాలకు వేసిన కుట్లను వైద్యులు ఆదివారం ఉదయం విప్పారు. అతడి ఆరోగ్యపరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం జైలులోనే రామ్‌కుమార్‌కు మానసిక చికిత్సా నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. పట్టుబడిన సమయంలో పోలీసులను చూసి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, గొంతుపై రెండు చోట్ల గల గాయాలు పూర్తిగా మానిపోయాయని డాక్టర్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Even as the process to prepare the charge sheet in the sensational Swathi murder case has begun, police sources said that during the three-day interrogation of the suspect P. Ramkumar, he was taken to the Nungambakkam railway station to demonstrate how he escaped after the murder.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి