చిదంబరం తండ్రీ కొడుకులకు ఊరట-ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంకు ఇవాళ భారీ ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లయింది.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ దర్యాప్తుపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ స్టే విధించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసును ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా చిదంబరం, కార్తి చిదంబరం అడిగిన పత్రాలను ఇచ్చే విషయంలో తమ స్పందన తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది. 2017లో ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్ధలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించే విషయంలో అవినీతి జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది.

2007లో చిదంబరం ఆర్ధికమంత్రిగా ఉండగా ఐఎన్‌ఎక్స్ మీడియాలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్వీకరణ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు జారీ చేసినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. పలు దఫాల విచారణ తర్వాత చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరంను సైతం నిందితుడిగా చేర్చింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు సీబీఐ కోర్టు విచారణపై స్టే విధించడం విశేషం. ఇదే కేసులో అక్రమ నిధుల ప్రవాహంపై ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది.












Click it and Unblock the Notifications