Year Ender 2024: కాంగ్రెస్ కు ఊపిరిపోసిన ఏడాది-ఎన్నికల్లోనూ, పార్లమెంట్లోనూ జోష్..!
2014 ఎన్నికల్లో కేంద్రంలో ఓటమి తర్వాత పూర్తిగా కుందేలైన కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది మాత్రం ఊపిరి పోసింది.. పదేళ్ల విరామం తర్వాత లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయాలతో పార్లమెంట్ లో ఉనికి చాటుకోవడంతో పాటు విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపిక కావడం, ఒకేసారి పార్లమెంట్ లో ముగ్గురు గాంధీల ప్రాతినిథ్యం కనిపిస్తుండటం.. ఇలా ఎటు చూసినా ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ ఏడాది సాధించిన విజయాలను ఓసారి చూద్దాం..
కాంగ్రెస్ పార్టీ ముక్త్ భారత్ తెస్తామంటూ కేంద్రంలో ఒకప్పుడు బీరాలు పలికిన ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఈ ఏడాది బిగ్ షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ .. ఇండియా కూటమిలోని మిత్రులతో కలిసి బీజేపీని పలుచోట్ల మట్టికరిపించింది. కీలకమైన యూపీలో సగానికి పైగా ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడంతో పాటు తన పాత కంచుకోటలు అమేథీ, రాయ్ బరేలీ సహా పలు చోట్ల సత్తా చాటుకుంది. రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు సీట్లు రాయ్ బరేలీ, వాయనాడ్ లోనూ ఘన విజయాలు సాధించారు. దీంతో ఇండియా కూటమి నాయకుడిగా విపక్ష నేతగా మారారు.

దీంతో ఇప్పుడు పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత బలమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమిని మార్చడంలో కాంగ్రెస్ వ్యూహం సక్సెస్ అయింది. అంతే కాదు కాంగ్రెస్ నుంచి తొలిసారి ముగ్గురు గాంధీలు రాహుల్, ప్రియాంక, సోనియా తొలిసారి పార్లమెంట్ లో ఉన్నారు. రాహుల్ రాయ్ బరేలీతో పాటు వాయనాడ్ లోనూ గెలిచిన నేపథ్యంలో వాయనాడ్ ను వదులుకుని ఉప ఎన్నికల్లో చెల్లెలు ప్రియాంకను గెలిపించుకున్నారు. అలాగే రాయ్ బరేలీని వదిలేసిన సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా మారారు. దీంతో పార్లమెంట్ ఉభయసభల్లోనూ గాంధీల ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ శ్రేణులకు బిగ్ బూస్ట్ గా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం జమిలి సహా ఏ కీలక నిర్ణయం తీసుకునే పరిస్ధితి లేదు.
మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, హర్యనా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా, మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అయితే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లో మాత్రం ఇండియా కూటమి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications