వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్‌కాయిన్: క్రిప్టో మైనింగ్‌లో కజకిస్తాన్, వరల్డ్ లీడర్‌గా ఎలా ఎదిగింది? చైనాలో నిషేధం ఈ దేశానికి కలిసొచ్చిందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అల్మాజ్ మగజ్

గత ఏడాది చైనా అకస్మాత్తుగా క్రిప్టో కరెన్సీ మైనింగ్‌ను నిషేధించినప్పుడు, పొరుగునే ఉన్న కజకిస్తాన్‌లో క్రిప్టో కరెన్సీ పరిశ్రమ వేగంగా విస్తరించింది. క్రిప్టో మైనింగ్‌లో కజకిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కానీ ఎనర్జీ-హంగ్రీ డేటా సెంటర్లు మాత్రం పెరుగుతోన్న కాలుష్యం, కర్బన ఉద్గారాల పరంగా బొగ్గు మండించే పవర్‌ స్టేషన్లపై ఒత్తిడి తెస్తున్నాయి.

మోల్డిర్ షుబయేవా, కజకిస్తాన్‌కు చెందిన క్రిప్టో ఎంటర్‌ప్రెన్యూర్. తన కొత్త 'బిట్‌కాయిన్ మైన్' బిల్డింగ్ సైట్‌ను సందర్శించినప్పుడు అక్కడి నిర్మాణ ఇంజనీర్లు, వర్కర్ల సమూహంలో ఆమె ప్రత్యేకంగా నిలుస్తారు.

35 ఏళ్ల షుబయేవా, ఆల్మటీ పట్టణంలో నిర్మిస్తోన్న తన కొత్త 'బిట్‌కాయిన్ మైన్' పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మగవాళ్ల ఆధిపత్యం ఉండే ఈ పరిశ్రమలో ఆమె పేరు గడించారు. దేశంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా తన మైనింగ్ కంపెనీని అభివృద్ధి చేసిన ఆమె గౌరవాన్ని సంపాదించారు.

''నా జీవితంలోని గత నాలుగేళ్లను పూర్తిగా పనికే పరిమితం చేశాను. కొన్నిసార్లు నేను ఆఫీసులోనే నిద్రపోయాను'' అని ఆమె చెప్పారు.

ఐదేళ్ల క్రితం ఆమెకు బిట్‌కాయిన్‌పై ఆసక్తి కలిగింది. తన సోదరునితో కలిసి ఇంటివద్దే కాయిన్ల కోసం మైనింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పెద్ద పెద్ద మైనింగ్ బ్లాక్‌లను ఏర్పాటు చేసి వాటిని వినియోగదారులకు అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు.

ముఖ్యంగా గతేడాది, తన బిజినెస్‌తో పాటు కజకిస్తాన్‌లో క్రిప్టో ఇండస్ట్రీ అభివృద్ధి విరామం లేకుండా కొనసాగిందని ఆమె చెప్పారు.

''బిట్‌కాయిన్ విలువ ఎంత పెరిగిందో చూసుకుంటూ నేను, నా రోజును ప్రారంభిస్తా. ఒక బిట్‌కాయిన్ విలువ 50వేల డాలర్లకు (సుమారు రూ. 38,58,835) చేరినప్పుడు చాలా ఉత్తేజంగా అనిపించింది'' అని ఆమె చెప్పారు.

బిట్‌కాయిన్ విలువ అనూహ్యంగా పెరుగుతుంది. అలాగే పడిపోతుంది. 2020 మార్చిలో బిట్‌కాయిన్ ధర సుమారు 5 వేల డాలర్లు (సుమారు రూ. 3,75,875) ఉండేది. కానీ ఏడాదిలోనే దాని విలువ 65వేల డాలర్ల (సుమారు రూ.48,86,375)కు పెరిగింది.

ఈ స్టోరీ మీరు చదువుతోన్న సమయానికి కూడా దీని ధరలో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

కానీ మోల్డిర్ సహా కజకిస్తాన్‌లోని అనేకమంది క్రిప్టో వ్యాపారులకు ఇది ఇంకా మంచి లాభాలనే అందిస్తోంది.

మైన్ సైట్‌లో మోల్డిన్ షుబయేవా

డిజిటల్ బంగారం

'క్రిప్టో మైనింగ్' అనేది బిట్‌కాయిన్, ఇథేరియం, లైట్‌కాయిన్ అనే క్రిప్టో కరెన్సీలకు ఊతమిచ్చే ప్రక్రియ.

డిజిటల్ రూపంలో ఉండే ఈ కరెన్సీలకు బ్యాంకులు ఉండవు. ప్రతి చెల్లింపూ కంప్యూటర్ల ఆధారంగానే జరుగుతోంది. దీనికోసం భారీ వ్యవస్థ రూపొందించి ఉంటుంది.

బిట్‌కాయిన్లు పొందడానికి పరిష్కరించాల్సిన అల్గారిథమ్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి. వీటిని ఛేదించడానికి కంప్యూటర్లకు అధిక శక్తి కావాల్సి ఉంటుంది.

వీటికి ఛేదించిన వారికి రివార్డుగా బిట్‌కాయిన్ లభిస్తుంది.

బిట్‌కాయిన్ మైనింగ్‌లో అమెరికా తొలి స్థానంలో ఉండగా, కజకిస్తాన్ రెండో స్థానానికి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా, క్రిప్టో కరెన్సీ గ్లోబల్ నెట్‌వర్క్ పవర్‌లో కజకిస్తాన్ వాటా 18 శాతంగా ఉంది. ఇది కరెన్సీ చలామణి కావడానికి దోహదపడుతుంది.

2019 నుంచి కజకిస్తాన్‌లో క్రిప్టో ఇండస్ట్రీ తన ఉనికిని చాటుకుంటోంది. కజకిస్తాన్‌లో విద్యుత్ ధరలు స్వల్పంగా ఉండటం, ప్రభుత్వ విధానాలు కూడా క్రిప్టో పరిశ్రమకు అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం.

కానీ 2021 వేసవిలో ఇది మరింత జోరునందుకుంది. పొరుగునే ఉన్న చైనా, క్రిప్టో మైనింగ్‌పై నిషేధం విధించడం కజకిస్తాన్‌కు కలిసివచ్చింది. దీంతో దేశంలోకి కంపెనీలు పోటెత్తాయి. వాటితోపాటు వేలాది కంప్యూటర్లను తీసుకొచ్చాయి. ఈ మేరకు కజకిస్తాన్‌లో మైనింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం తలెత్తింది.

ఇనిజెక్స్‌ కంపెనీకి చెందిన ఎకిబస్టుజ్ మైన్

కజకిస్తాన్ మెగా మైనింగ్

మీరు అల్మటీ నుంచి 800 మైళ్ల దూరంలో ఉన్న ఎకిబస్టుజ్ అనే నగరానికి ప్రయాణిస్తే మీకు కజకిస్తాన్‌లో క్రిప్టో మైనింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

ఇటీవలి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో మైన్‌గా ఉన్న కంపెనీని మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని 'ఇనిజెక్స్' అనే కంపెనీ నిర్మించింది.

మీరు ఈ మైన్‌లోకి అడుగు పెట్టడానే ధ్వనుల హోరు మీకు వినబడుతుంది.

శక్తివంతమైన వేలాది కంప్యూటర్లు ఇక్కడ పనిచేస్తుంటాయి. వాటికి అమర్చి ఉన్న చిన్న చిన్న ఫ్యాన్లు పూర్తి వేగంతో తిరుగుతుంటాయి. వీటికి కొద్ది దూరంలో కూలింగ్ బ్లేడ్స్ తిరుగుతాయి.

''పనిచేస్తోన్న ఆ కంప్యూటర్ల నుంచి వచ్చే ధ్వని నాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అది డిజిటల్ మనీ సౌండ్'' అని ఆ కంపెనీ యజమాని, 34 ఏళ్ల యెర్బోల్సిన్ అన్నారు.

బిట్‌కాయిన్ మైన్

మోల్డిర్ తరహాలోనే కొన్నేళ్ల క్రితమే బిట్‌కాయిన్‌పై ఆసక్తి పెంచుకున్నయెర్బోల్సిన్ కూడా క్రిప్టో వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి నేటి స్థితికి చేరుకున్నారు.

మొదట చిన్న గ్యారేజ్‌లో కొద్దిసంఖ్యలో కంప్యూటర్లతో యెర్బోల్సిన్ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు 300మిలియన్ డాలర్ల విలువైన పరికరాలతో 8 కేంద్రాల్లో రోజులో 24 గంటలపాటు ఆయన కంపెనీల్లో క్రిప్టో కరెన్సీ మైనింగ్ జరుగుతోంది.

యంత్రాలను పర్యవేక్షించడానికి 150 మంది ఉద్యోగులు, డజన్ల కొద్ది ఇంజనీర్లు పనిచేస్తుంటారు.

19 ఏళ్ల అల్మాజ్ మగజ్ 12 గంటలపాటు షిఫ్టులో పనిచేస్తారు. కంప్యూటర్స్ హ్యాంగర్స్‌, దుమ్ము కారణంగా పనిచేయడం ఆపేస్తే వాటిని బాగు చేయడం ఆయన పని.

అక్కడ పనికి చేరిన కొత్తలో ఆ యంత్రాలు ఏం పనిచేస్తున్నాయో తనకు అర్థమయ్యేది కాదని ఆయన ఒప్పుకున్నారు.

''ఇక్కడికి వచ్చేవరకు కూడా నాకు బిట్‌కాయిన్ అంటే ఏంటో తెలియదు. నేనెప్పుడూ దాని గురించి వినలేదు'' అని ఆయన చెప్పారు. అల్మాజ్‌తోపాటు అక్కడ పనిచేసేవారిని ఆల్మటీ నుంచి సీసీటీవీల ద్వారా యెర్బోల్సిన్ పర్యవేక్షిస్తుంటారు.

''మాకు చాలా గర్వంగా ఉంది. క్రిప్టో కరెన్సీ ప్రపంచానికి కజకిస్తాన్ కీలకంగా మారింది. మేమంతా దేశభక్తులం. మా దేశ జెండా మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకుంటున్నాం'' అని యెర్బోల్సిన్ అన్నారు.

కజకిస్తాన్‌లోని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం

మూల్యంగా పర్యావరణం

దేశం ఇటీవల సాధించిన ఈ ప్రగతి పట్ల దేశపౌరులందరూ గర్వంగా భావించడం లేదు. క్రిప్టో మైనింగ్‌లో వినియోగించే శక్తి వనరుల దృష్ట్యా పర్యావరణ కార్యకర్తలు తరచుగా క్రిప్టో కరెన్సీని విమర్శిస్తుంటారు.

యుక్రెయిన్, నార్వే వంటి దేశాలు వినియోగించే మొత్తం శక్తి కంటే కూడా బిట్‌కాయిన్ల మైనింగ్‌కే అధిక శక్తి వినియోగిస్తున్నట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన బిట్‌కాయిన్ విద్యుత్ వినియోగ సూచిక అంచనా వేసింది.

మైనింగ్ కోసం వినియోగిస్తోన్న శక్తిలో పునరుత్పాదక శక్తి ఎంత ఉందో తెలియదు. కానీ కజకిస్తాన్‌లో 2 శాతం విద్యుత్ మాత్రమే పునరుత్పాదక వనరుల నుంచి లభిస్తుందని వాతావరణ నిపుణులు డానా యెర్మోలియనోక్ చెప్పారు.

''ఇక్కడ బొగ్గునే ప్రధానంగా వాడతారు. మరీ ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, వేడిని ఉత్పత్తి చేయడంలో బొగ్గునే వాడతారు'' అని డానా తెలిపారు.

దేశంలోని అత్యధిక స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్న నగరాల్లో ఒకటైన కరగండలో డానా నివసిస్తారు. ''క్రిప్టో మైనింగ్ ద్వారా కూడబెడుతోన్న సంపద అంతా పర్యావరణాన్ని మూల్యంగా చెల్లించి సంపాదిస్తున్నదే'' అని ఆమె అన్నారు.

''ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతీసారి నాకు బయట కాలుష్యం కనిపిస్తుంది. చలికాలంలో అయితే గాలి లేని సమయంలో మా పొరుగింటివారి ద్వారం కూడా కనిపించదు. ఇలాంటి గాలిని నేను ఎందుకు పీల్చాలో అర్థం కాదు'' అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆల్మటీ వీధుల్లో భద్రతా బలగాలు

శక్తి వనరుల కొరత

క్రిప్టో కరెన్సీ మైనింగ్, శక్తి వనరుల కొరతకు దారి తీస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

''కేవలం ఒక ఏడాది క్రిప్టో మైనింగ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో 7 నుంచి 8 శాతం పెరుగుదల నమోదైందని'' ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో జరుగుతోన్న మైనింగ్‌లో వాడుతోన్న శక్తి, ఒక పెద్ద పట్టణంలో లైట్లన్నీ వెలిగించడానికి అవసరమైన శక్తి పరిమాణానికి సమానం.

పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికి గతేడది నవంబర్‌లో రష్యా నుంచి విద్యుత్‌ను దిగుమతి చేసుకున్నారు. విద్యుత్ సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైనింగ్‌పై నిబంధనలను ప్రవేశపెట్టారు.

ఈ ఆంక్షల వల్ల కొంతమంది వ్యాపారులు తమ కంపెనీలను మరో చోటకు తరలించేందుకు ప్రయత్నించారు.

''కజకిస్తాన్‌లో క్రిప్టో బూమ్ చాలా వేగంగా వ్యాప్తి చెందింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది'' అని బీబీసీతో కజకిస్తాన్ డిజిటల్ డెవలప్‌మెంట్ ఉప మంత్రి అక్షత్ ఒరాజ్బెక్ చెప్పారు.

''క్రిప్టో మైనర్లు వినియోగిస్తోన్న విద్యుత్ పరిమాణంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019లో మా వద్ద విద్యుత్ మిగులు ఉండేది. కానీ ఇప్పుడు విద్యుత్ మిగులు గురించి మాట్లాడట్లేదు. కజకిస్తాన్‌లో విద్యుత్ అపరిమితం కాదు. అందుకే కొంత స్థాయి వరకు క్రిప్టో మైనింగ్‌ను మేం నిలిపివేయాలని అనుకుంటున్నాం'' అని ఆయన చెప్పారు.

ఒరాబ్జెక్ ప్రభుత్వం జనవరిలో మైనింగ్ పరిశ్రమ ఉపయోగించే విద్యుత్‌పై పన్ను విధిస్తూ లెవీని ప్రవేశపెట్టింది. విద్యుత్ వాడకాన్ని బట్టి పన్ను వసూలు చేయనుంది. పన్ను ద్వారా లభించే ఆదాయాన్ని స్వచ్ఛమైన ఇంధన వనరులను సృష్టించేందుకు వినియోగించవచ్చని వారు ఆశిస్తున్నారు.

''నిజం చెప్పాలంటే కజకిస్తాన్‌లో మైనింగ్‌లో డర్టీ ఎనర్జీని వినియోగిస్తున్నారు.''

''అందుకు క్రిప్టో మైనర్ల కోసం ఒక నిర్ణీత కోటాను ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. గ్రీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తేనే మరింత అభివృద్ధి సాధించగలం'' అని ఆయన అన్నారు.

అయితే చైనా, కొసావో, రష్యాలాంటి దేశాల్లా కాకుండా కజకిస్తాన్, మైనింగ్ పరిశ్రమను కొనసాగించేందుకే కట్టుబడినట్లు కనిపిస్తోంది.

''ఇది ఒక రకమైన సాంకేతిక ఉద్యమం'' అని ఒరాజ్బెక్ అన్నారు.

''ఈ ఉద్యమం నుంచి తప్పుకోవడం మా లక్ష్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా సాగుతోన్న క్రిప్టో ఉద్యమంలో మేం భాగంగానే ఉంటాం.''

ఇంధన ధరలు ఆకస్మికంగా పెరగడంతో ఈ నెల ప్రారంభంలో చెలరేగిన హింసాత్మక నిరసన ఘటనల నుంచి కజకిస్తాన్ ఇంకా కోలుకుంటోంది.

వీటికి క్రిప్టో మైనింగ్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ దీని ద్వారా రెండు విషయాలు తేటతెల్లం అయ్యాయి.

ఒకటి, ఇంధన సరఫరా తగినంత లేకపోతే ఏం జరుగుతుందో అర్థమైంది. రెండు, క్రిప్టో ప్రపంచంలో కజకిస్తాన్ ఎంత కీలకంగా మారిందో తెలిసింది.

కజకిస్తాన్ ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేసినప్పుడు గ్లోబల్ బిట్‌కాయిట్ నెట్‌వర్క్ గణనీయంగా నెమ్మదించడంతో పాటు వాటి విలువ పతనం అయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bitcoin: How did Kazakhstan become a world leader in crypto mining
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X