త్రిపుర పోరులో హింస-లెఫ్ట్, తిప్రామోతా నేతలపై బీజేపీ దాడులు ? 60శాతం దాటిన పోలింగ్..
ఈశాన్యరాష్ట్రం త్రిపురలో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హింస చోటు చేసుకుంటోంది. సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు హింసకు పాల్పడవచ్చంటూ ఉదయం ఆరోపించిన సీఎం మాణిక్ సాహా.. స్వయంగా బీజేపీయే దాడులకు దిగడంతో ఆత్మరక్షణలో పడ్డారు. త్రిపురలోని పలు చోట్ల పోలింగ్ సందర్భఁగా చోటు చేసుకున్న హింసలో పలువురు లెఫ్ట్, తిప్రా మోతా కార్యకర్తలు గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
అధికార బీజేపీకి చెందిన కార్యకర్తలు ప్రజలను ఓట్లు వేయకుండా ఆపడం ద్వారా పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తున్నారని సీపీఐ(ఎం) సీనియర్ నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. దీనిపైఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కొన్ని చోట్ల బీజేపీ కార్యకర్తలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, నిర్భయంగా ఓట్లు వేయకుండా ఆపుతున్నారని మాణిక్ సర్కార్ ఆరోపించారు. కొన్ని చోట్ల ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించని చోట్ల, వారు అనుమతించకపోతే, వారు రోడ్లను దిగ్బంధించి, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. వారు ఇతరులను ఓటు వేయనివ్వరంటూ సర్కార్ ఆరోపించారు.

అటు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ధన్‌పూర్, మోహన్‌పూర్‌లలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని తిప్రా మోతా కూటమి ఆరోపించింది. పలు పోలింగ్ బూత్‌లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పనికిరాకుండా పోయాయని తెలిపింది. తిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దేవ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, ధన్‌పూర్, మోహన్‌పూర్‌లో అధికార పార్టీ హింసకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ధన్‌పూర్, మోహన్‌పూర్‌లో జరిగిన హింసాకాండతో పాటు ఈవీఎంలలో లోపాలున్నాయని ఫిర్యాదు చేసినట్లు ప్రద్యోత్ వెల్లడించారు. మరోపైపు త్రిపుర ఎన్నికల పోలింగ్ శాతం మధ్యాహ్నం 1 గంట కల్లా 50 శాతం దాటింది. తాజా సమాచారం ప్రకారం అది 60 శాతం దాటినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications